కరీంనగర్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎందుకు రాజీనామా చేసిండో చెప్పడంలేదని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం గుండేడులో టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో పాటు ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా బాల్కసుమన్ మాట్లాడారు. మాసాయిపేటలో వందల ఎకరాల దళితుల భూమిని ఈటెల కబ్జా చేసిండని మండిపడ్డారు. ఆ భూముల్లో అక్రమంగా కోళ్ల ఫారాలు కట్టిండని, బలవంతంగా బెదిరించి భూములు లాక్కున్నాడని విమర్శలు గుప్పించారు. భూ బండారం బయటపడుతుందనే ఈటెల రాజీనామా చేసిండన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. టిఆర్ఎస్ వెంట ఉంటే పనులు అవుతాయని, ఈటెల వెంట ఉంటే ఏమీ కాదని, బండి సంజయ్‌ను ఎంపిగా గెలిపిస్తే రూపాయి పని కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. సిఎం కెసిఆర్ ఇప్పటివరకు లక్షా 32 వేల ఉద్యోగాలు ఇచ్చారని, ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని బాల్కసుమన్ దుయ్యబట్టారు. బిజెపి ప్రభుత్వం ఆస్తులను అమ్ముతూ ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా బిజెపి ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు.