భారత సైనిక దళ అధినేత ఎంఎం ఎన్
లద్ధాఖ్/న్యూఢిల్లీ : సరిహద్దులలో అంతా ప్రశాంతమే కానీ ఇటీవలి కాలంలో లద్థాఖ్ వెంబడి గణనీయంగా సైన్యాన్ని దింపింది. ఇది ఆందోళనకర పరిణామం అని భారత సైనిక దళాల అధినేత జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే తెలిపారు. లద్థాఖ్ ప్రతిష్టంభనపై చైనాతో భారతదేశం 13వ దఫా సైనికాధికారుల స్థాయి చర్చలు వచ్చే వారం జరుగుతాయి. ఈ దశలో శనివారం ఉదయం ఆయన చైనా వైఖరి గురించి తెలిపారు. గత ఆరు నెలలుగా సరిహద్దుల వెంబడి పరిస్థితి సద్దుమణిగిందని, అయితే చైనా సైన్యం కదలికలు కలవరానికి దారికల్పిస్తున్నాయని నరవణే చెప్పారు. ఈస్టర్న్ లద్ధాఖ్, ఉత్తర దిశలో ఈస్టర్న్ కమాండ్ వరకూ ఎక్కువ సంఖ్యలో చైనా సైనిక సంచారం ఉందని, ప్రత్యేకించి ఫార్వర్డ్ ఏరియాలలో చైనా సైన్యం పెరగడం కీలక పరిగణనాంశం అయిందన్నారు.
పరిస్థితిని తాము అన్ని స్థాయిలలో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నామని, నిఘా సంస్థల సమాచారాన్ని క్రోడీకరించుకుంటూ క్షేత్రస్థాయిలో మౌలిక వ్యవస్థను మెరుగుపర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నామని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితిని అయినా ధైర్యంగా ఎదుర్కొని తిప్పికొట్టగలమని ధీమా వ్యక్తం చేశారు. ఏ ప్రాంతంలో అయినా కొద్దిపాటి అతిక్రమణ అయినా జరిగి ఉంటుందనే అనుమానాలు ఉన్నాయని వివరించారు. సంప్రదింపులతో సైనిక ఉపసంహరణకు వీలేర్పడిందని, ఘర్షణాయుత ప్రాంతాల జటిలతను పరిష్కరించుకోవడం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల రెండో వారంలో 13వ దఫా చర్చలు జరుగుతాయని, పూర్తిస్థాయిలో సైన్యం వెనకకు మళ్లే విషయంలో ఏకాభిప్రాయం కుదురుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.