Friday, November 22, 2024

చెలరేగిన జైస్వాల్, శివమ్.. చెన్నైపై రాజస్థాన్ సూపర్ విక్టరీ

- Advertisement -
- Advertisement -

జైస్వాల్ విధ్వంసం, చెలరేగిన శివమ్.. గెలిచి నిలిచిన రాజస్థాన్
రుతురాజ్ శతకం వృథా, చెన్నైపై రాయల్స్ ఘన విజయం

అబుదాబి: ఐపిఎల్ సీజన్14లో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో రాజస్థాన్ ప్లేఆఫ్ రేసులో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 17.3 ఓవర్లలోన కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, ఎవిన్ లూయిస్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు విధ్వంసక బ్యాటింగ్‌తో చెన్నై బౌలర్లను హడలెత్తించారు. తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన జైస్వాల్, లూయిస్ స్కోరును పరిగెత్తించారు. చెలరేగి ఆడిన లూయిస్ 12 బంతుల్లోనే రెండు సిక్సర్లు, మరో 2 ఫోర్లతో 27 పరుగులు చేశాడు. మరోవైపు జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. సునామీ ఇన్నింగ్స్ ఆడిన జైస్వాల్ 21 బంతుల్లోనే మూడు సిక్సర్లు, 6 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. జైస్వాల్, లూయిస్ 5.2 ఓవర్లలోనే 77 పరుగులు జోడించి రాజస్థాన్‌కు విజయాన్ని ఖరారు చేశారు. తర్వాత వచ్చిన శివమ్ దూబే, కెప్టెన్ సంజు శాంసన్‌లు కూడా అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచారు. శాంసన్ సమన్వయంతో ఆడగా, శివమ్ విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. అసాధారణ బ్యాటింగ్‌తో అలరించిన శివమ్ 42 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, మరో 4 ఫోర్లతో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన సంజు శాంసన్ 4 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. గ్లెన్ ఫిలిప్ప్ 14 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించాడు.
శతకంతో చెలరేగి రుతురాజ్
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నైకి ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అండగా నిలిచాడు. చారిత్రక ఇన్నింగ్స్ ఆడిన గైక్వాడ్ శతకంతో ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ బౌలర్లను హడలెత్తించిన గైక్వాడ్ 60 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, మరో 9 ఫోర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ఐపిఎల్‌లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. రవీంద్ర జడేజా 32 (నాటౌట్), మోయిన్ అలీ (21), డుప్లెసిస్ (25) తమవంతు పాత్ర పోషించడంతో చెన్నై స్కోరు 189 పరుగులకు చేరింది.

IPL 2021: RR Beat CSK With 7 wickets

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News