Friday, November 22, 2024

అదరగొట్టిన మిథాలీ సేన..

- Advertisement -
- Advertisement -

Team India dominated the Pink Ball Test

 

క్వీన్స్‌లాండ్: ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన చారిత్రక డేనైట్ టెస్టు మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు అసాధారణ ఆటతో అలరించింది. ఒక వేళ వర్షం రెండు రోజుల పాటు అంతరాయం కలిగించకపోతే ఈ మ్యాచ్‌లో మిథాలీరాజ్ సేన చారిత్రక విజయం సాధించేదే. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై వారి సొంత గడ్డపై ఇలాంటి ప్రదర్శన చేయడం ఎలాంటి పెద్ద జట్టుకైనా చాలా కష్టంతో కూడుకున్న అంశం. అయితే టీమిండియా మాత్రం తొలి రోజు నుంచే పింక్ బాల్ టెస్టులో ఆధిపత్యం చెలాయించింది. ప్రతికూల వాతావరణంలోనూ భారత బ్యాటర్లు అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచారు. ముఖ్యంగా ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ బ్యాటింగ్‌ను ఎంత పొగిడినా తక్కువే. ప్రపంచంలోనే అత్యంత బలమైన బౌలింగ్ లైనప్ కలిగిన ఆస్ట్రేలియాపై వీరిద్దరూ అద్భుతంగా రాణించారు. షఫాలీ, మంధానలు ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా అసాధారణ బ్యాటింగ్‌తో అలరించారు. ఇక స్మృతి మంధాన అయితే భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే చిరకాలం గుర్తుండి పోయే ఇన్నింగ్స్‌ను ఆడింది.

ఆస్ట్రేలియా బౌలర్లను హడలెత్తిస్తూ మంధాన సాగించిన బ్యాటింగ్‌ను ప్రశంసించక తప్పదు. మంధాన అసాధారణ బ్యాటింగ్ వల్ల్లే భారత్ మ్యాచ్‌లో పటిష్ఠస్థితికి చేరిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. షఫాలీ, పూనమ్ రౌత్‌లతో కలిసి తొలి ఇన్నింగ్స్‌లో మంధాన జోరును కొనసాగించింది. ఈ క్రమంలో ఎన్నో చిరస్మరణీయ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. డేనైట్ టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా మంధాన రికార్డు సృష్టించింది. అంతేగాక ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో శతకం సాధించిన నమోదు చేసి మొదటి భారత విమెన్ క్రికెటర్‌గా కూడా మంధాన నిలిచింది. ఇక దీప్తి శర్మ, కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. బౌలింగ్‌లోనూ భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. వెటరన్ జులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్, మేఘన సింగ్, దీప్తి శర్మలు నిలకడైన బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌ను కట్టడి చేశారు. సమష్టిగా రాణించి ఆస్ట్రేలియా బ్యాటర్లను కోలుకునే అవకాశం ఇవ్వలేదు.

ఆత్మవిశ్వాసం పెంచే ప్రదర్శన

ఇక ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో మహిళా జట్టు చేసిన ప్రదర్శన చేసిన భారత క్రికెట్‌కు కొత్త దిశను చూపడం ఖాయం. ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ భారత మహిళా జట్టు అసాధారణ ఆటను కనబరిచింది. తాజాగా ఆస్ట్రేలియాపై కూడా స్ఫూర్తిదాయక ఆటను కనబరచడం విశేషం. ఈ ప్రదర్శన టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయడం ఖాయం. రానున్న వరల్డ్‌కప్‌లో మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఇది దోహదం చేస్తుందనే చెప్పాలి. ఇక అసాధారణ ఆటతో అలరించిన మిథాలీ రాజ్ సేనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తనకంటే ఎంతో బలమైన జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు కొనియాడుతున్నారు. ఈ సిరీస్ భారత మహిళా క్రికెట్‌కు కొత్త దారి చూపడం ఖాయమని జోస్యం చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News