బోర్డు కార్యదర్శికి ఈఎన్సీ లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణాబేసిన్ పరిధిలోని తుంగభద్ర నదీజలాలనుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు కేటాయించిన కోటా నీటికిమించి అధికంగా తరలిస్తోందని తెంలగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ తుంగభద్ర బోర్డుకు తెలిపారు. కర్నూలుకడప కాలువ పథకానికి తుంగభద్ర నీటికి బదులు నేరుగా కృష్ణానది నీటిని ఉపయోగించుకూంటూనే మళ్లీ తుంగభద్ర నీటిని కూడా వాడుకుంటున్నట్టు తెలిపారు. తుంగభద్ర ఎగువ కాలువ, దిగువ కాలువలకు కూడా బచావత్ ట్రిబ్యునల్‌లో కేటాయించిన కోటాకు మించి నీటిని తరలిస్తున్నట్టు బోర్డు దృష్టికి తెచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ రాజోలిబండ డైవర్సెన్ స్కీంకు తుంగభద్ర నది నుంచి 15.9టిఎంసిల నీటి కేటాయించిందని తెలిపారు.
అయితే నీటికేటాయింపుల్లో తెలంగాణ రాష్ట్రానికి 5.6టిఎంసిలకు మించి నీరు అందటం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగబధ్ర జలాలను కోటాకు మించి అధికంగా మళ్లించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా రాజోలిబండ్ మళ్లింపు పథకం ఆధునీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని కోఆరు. ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో తుంగభద్ర జలాలు అందజేయాలని తుంగభద్ర బోర్డు కార్యదర్శికి నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ఈ మేరకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.