Sunday, November 24, 2024

వచ్చే బడ్జెట్‌లో దళితబంధుకు రూ.20వేల కోట్లు

- Advertisement -
- Advertisement -

Rs 20000 crore for Dalitbandhu in coming budget

ఎస్‌సిల రిజర్వేషన్లు పెంచాలి

దళితబంధు ఆలోచన ఈనాటిది కాదు
2003లోనే మేధావులతో చర్చించి పాలసీని నిర్ణయించాం, మొత్తం 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలని ఆలోచన ఉంది
బిసి కుల గణన జరిగి తీరాల్సిందే
అందుకోసం అసెంబ్లీతో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం : సిఎం కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే ఏడాది రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో దళిత బంధుకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా మంగళవారం నాడు అసెబ్లీలో దళితబంధుపై చర్చ జరిగింది. ఈ చర్చ సందర్బంగా దళితబందుపై సభ్యులు లేవనెత్తిన సందేహాలకు సిఎం వివరణ ఇస్తూ ..వచ్చే బడ్జెట్‌లో దళితబంధు పథకానికి రూ.20వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. దళితబంధు హుజూరాబాద్ కోసం తెచ్చింది కాదన్నారు. 1986లోనే తాను తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్నపుడే దళితబంధు పురుడుపోసుకున్నదని, సిద్దిపేటలో దళితచైతన్య కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. దళిత మహిళా సంఘాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 2003లోనే దళిత మైనారిటీ మేధావులతో సమావేశం నిర్వహించి దళితబంధు పాలసీని రూపొందించామని తెలిపారు. దేవుని దయవల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. రాష్ట్రం వచ్చాక ప్రభుత్వం విద్యుత్, తాగునీరు, సాగునీరుకి ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. మిషన్ కాకతీయతో భూర్భజలాలు పెరిగాయని, మిషన్ కాకతీయ పనులు చేపట్టాక చెరువులన్నింటినీ పటిష్ట పరిచామని అందుకు ఇంతటి భారీ వర్షాలు వరదలు వచ్చిన కూడా రాష్ట్రంలో ఎక్కడా ఒక్క చెరువుకు కూడా గండిపడలేదని స్పష్టం చేశారు.

రెండోసారి అధికారంలోకి వచ్చాక దళితబంధు చేపట్టాలని గతంలోనే అనుకున్నామని, దళితబంధు పథకం గతేడాది ప్రారంభం కావాల్సి ఉందన్నారు. కరోనా వల్ల పథకం ఏడాది ఆలస్యమైందని చెప్పారు. కరోనా వల్ల రాష్ట్రానికి రూ.లక్ష కోట్లు నష్టం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో భూములు అమ్మకానికి పెట్టామని ,ధరలు బాగా పెరిగి రాష్ట్రానికి రూ. 2700కోట్లు వచ్చాయన్నారు. పరిస్థితుల మేరకు బడ్జెట్ అంచనాలు సవరించి నిధులు కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలో 11.5శాతం గ్రోత్ పెరిగిందని దేశంలోనే ప్రధమస్థానంలో నిలిచామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం బెస్ట్ కంట్రిబ్యూషన్ స్టేట్‌గా ఉన్నట్టు రిజర్వ్‌బ్యాంక్ , కాగ్ నివేదికలే స్పష్టం చేశాయని వెల్లడించారు. రాష్ట్రంలో దళితబంధును క్రమంగా 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలనే ఆలోచన తమకు ఉందని స్పష్టం చేశారు. ప్రయోగాత్మకంగా ఒక్కో నియోజకవర్గానికి వంద మందికి ఇవ్వాలని అనుకున్నామని, దళితబంధు పథకం ఇంకా ప్రారంభంలోనే ఉందని పేర్కొన్నారు.

అమలులో కనిపించే లోటుపాట్లను సవరించుకుంటూ ముందుకెళ్తామని, రాష్ట్రంలో హూజూరాబాద్ నియోజకవర్గంతోపాటు నాలుగు మూలల నుంచి విభిన్నమైన నాలుగు మండలాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇటు వంటి పథకం ప్రపంచంలోనే తెలంగాణలో తప్ప మరెక్కడా లేదన్నారు. దీనికి ఆధ్యులం మనమే అవుతున్నామన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు ప్రతిపాదించామని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్‌ను ఇందిరాగాంధీ కాలంలో ఏర్పాటు చేశారని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం పొంది బాగుపడిన వారు కనిపించడం లేదన్నారు.దళితబంధు నిధులతో ఫలానా పని చేయాలని ప్రభుత్వం బలవంతం పెట్టదని, వారికి వచ్చిన ,నచ్చిన పని చేసుకోవచ్చని తెలిపారు. మార్చిలోపు వంద నియోజకవర్గాల్లో దళితబంధు అమలు చేస్తామన్నారు. దళితబంధు నిధులు మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రమంతా ఖర్చు చేస్తే రూ.1.80లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశామన్నారు. ఒక్కహూజూరాబాద్ ఎన్నిక కోసం పచ్చిఅపద్దం ఆడతామా అని ప్రశ్నించారు. ఇంత దుర్మార్గం పనికి రాదని ప్రతిపక్షాలకు హితవు పలికారు.

దళితబంధు కింద నియోజకవర్గానికి వంద మందిని ఎంపిక చేసే బాధ్యత ఎమ్మెల్యేదేనని చెప్పారు. వచ్చే బడ్జెట్‌లో రూ.20వేలకోట్లు ఖర్చు చేస్తామని, వచ్చే బడ్జెట్‌లో నిధులతో నియోజకవర్గానికి 2వేల మందికి దళితబంధు సాయం అందించనున్నట్లు వెల్లడించారు. రూ.10లక్షలతో ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చని, లబ్ధిదారులు బృందంగా ఏర్పడి పెద్ద పరిశ్రమ కూడా పెట్టుకోవచ్చన్నారు. దళితుల రక్షణ కోసం నిధి కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ లైసెన్స్ అవసరమయ్యే వ్యాపారాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు ఇస్తున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో దళితుల జనాభా 15శాతం ఉందన్నారు. కాని ఇటీవల ఇది ఇంకా పెరిగివుండవచ్చన్నారు. హైదరాబాద్ మినహా ప్రతి జిల్లాలో 20 శాతం మంది ఎస్సీలు ఉన్నారని, అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 26.64శాతం, అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 17.53 ఎస్సీ జనాభా ఉన్నారన్నారు.రాష్ట్రంలో 18,22,291దళిత కుటుంబాలు ఉన్నాయని ,కోటి 3లక్షల 93వేల 967మంది దళితులు ఉన్నట్టు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలన్నారు.

బీసీ కుల గణన జనాభా లెక్కలు జరగాల్సిందేనన్నారు. కుల గణన కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్లు తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం తీర్మానం చేసిన కేంద్రానికి పంపించామని, ప్రదానికి 25సార్లు నివేదికలు ఇచ్చామని , ఎన్ని తీర్మానాలు పంపినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులకు సైతం రైతుబంధు ఇచ్చామని, ఎస్సీ ప్రభుత్వ ఉద్యోగికి కూడా దళితబంధు ఇస్తామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరికీ దళితబంధు అమలు చేస్తామన్నారు.రాష్ట్రంలోని అన్ని ఎస్సీ కుటుంబాలకు దళితబంధు ఇస్తామని.. ఓటు ఎవరికైనా వేసుకోవచ్చన్నారు. దళితబంధుతో ముడిపెట్టమని, పార్టీకలతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని, ప్రతి ఎస్సీ కుటుంబానికి దళితబంధు అందించాలనేదే మా లక్ష్యమని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దళితులు దయనీయ స్థితిలో ఉన్నారని సీఎం కేసీఆర్ అన్నారు.

దళితులతో పాటు అన్ని వర్గాల్లో అణగారిన వారు ఉన్నారన్నారు. తరతరాలుగా సామాజిక వివక్షకు గురైన జాతి దళిత జాతి అని, 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత సైతం దళితుల జీవితాల్లో మార్పులు రాలేదన్నారు. స్వాతంత్య్రానికి ముందు కూడా దళిత జాతి హింసకు గురైందన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ ఉజ్వలమైన పాత్ర పోషించారని, క్రమంగా అంబేద్కర్ ఆలోచనా సరళి బయటకు వస్తోందన్నారు. తెలంగాణ ఏర్పడింది కూడా అంబేద్కర్ పుణ్యమే అని గతంలో చెప్పానన్నారు.రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్‌కు ఉండాలని అంబేద్కర్ చెప్పారని, అంబేద్కర్ అనేక పోరాటాలు సాగించారన్నారు. అణచివేతకు గురైన వర్గాలకు సాధికారత చేకూర లేదని, గత ప్రభుత్వాలు కొంత చేశాయి.. ఎంత మార్పు వచ్చిందన్నారు. దేశాన్ని ఒక్క కాంగ్రెస్సే పాలించలేదని, అనేక పార్టీలు పాలించాయన్నారు. అనేక రాష్ట్రాల్లో అనేక భిన్నమైన ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయని.. అవకాశాలు లేక దళితులు సతమతమవుతున్నారని చెప్పారు.

మేం పొలాలు పంచామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెబుతున్నారని, 75లక్షల మంది దళితులు ఉంటే 13లక్షల భూములే ఉన్నాయన్నారు. నినాదాలు వచ్చాయి.. కానీ గణనీయమైన మార్పు రాలేదన్నారు.పాలమూరు వంటి జిల్లా నుంచి లక్షల మంది వలసలు వెళ్లారని.. తెలంగాణ ఏర్పాటును విఫలప్రయత్నమని చెప్పే ప్రయత్నాలు జరిగాయన్నారు. బాలారిష్టాల్ని అధిగమించుకుంటూ సంక్షేమం కోసం పాటుపడ్డామన్నారు. ఆసరా పింఛన్లు పెంచామని.. వికలాంగుల పింఛను రూ.3వేలకు పెంచినట్లు చెప్పారు. తెలంగాణలో 3కోట్ల టన్నుల వరిధాన్యం పడుతోందని, తెలంగాణలో వ్యవసాయ రంగ స్థిరీకరణ జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా పచ్చదనం కనిపిస్తోందని, రాష్ట్రంలో పెండింగ్ పనులు పూర్తి చేశామన్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని.. ప్రకృతి సైతం సహకరిస్తోందని చెప్పారు.

విభజనకు ముందు ఏపీలో ఎకరం అమ్మినా తెలంగాణలో నాలుగు ఎకరాలు కొనే పరిస్థితి లేదని.. వ్యవసాయంలో రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు.ఇప్పుడు ఒక ఎకరం తెలంగాణలో అమ్మి.. ఆరు ఎకరాలు ప్రకాశం జిల్లాలో కొనే పరిస్థితి ఉందన్నారు. ఉచిత విద్యుత్‌తో రైతులకు భరోసా ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో కోటి29లక్షల ఎకరాలు సాగవుతోందని.. యాసంగిలో 65లక్షల ఎకరాలు సాగులో ఉందని వివరించారు. నీటి తీరువా బకాయిలు రద్దు చేశామని, నీటి తీరువా పన్నే లేదన్నారు. ఉచిత నీరు, విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి 26లక్షల టన్నుల ఎరువులు వినియోగిస్తున్నామని, గతంలో 8లక్షల ఎరువులు మాత్రమే వినియోగించారని సిఎం కేసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News