తిరువనంతపురం: కేరళలోని శబరిమల తీర్థయాత్ర మొదలు కావడానికి ఇంకా నెల రోజుల సమయమే ఉంది. కోవిడ్ వ్యాధి దృష్టా భక్తులు సురక్షితంగా దర్శనం చేసుకునేందుకు కేరళ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు బుధవారం తెలిపింది. సోషల్ డిస్టెన్స్ కోసం మార్గదర్శకాలను కూడా రూపొందిస్తోంది. ఇప్పటికే అయ్యప్ప స్వామి గుడి, దాని పరిసర ప్రాంతాల్లో మార్గదర్శకాలను అమలుచేస్తున్నామని దేవస్థానం మంత్రి కె. రాధాకృష్ణన్ అసెంబ్లీలో తెలిపారు. పంబ, ఎరుమెలిల్లో ఆసుపత్రి వసతులు సహా ఆరోగ్య, రెవెన్యూ శాఖల మధ్యన కార్యాచరణ ప్రణాళికను రచించినట్లు ఆయన అసెంబ్లీ ప్రశ్నోత్తర సమయంలో తెలిపారు. ఇదిలా ఉండగా ఎంత మంది భక్తులను అనుమతించాలనే విషయంలో ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంది.
శబరిమల తీర్థయాత్ర రెండు నెలలపాటు ఉండగలదు. నీరు, ఆహారం, ప్రాంగణాల్లో మరుగుదొడ్లు వంటి విషయాల్లో ఎలాంటి లోటు ఉండకుండా ఏర్పాట్లు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. శబరిమల యాత్ర నవంబర్ 16 నుంచి మొదలు కానుంది.