కార్మికులకు ఈ నెల 11న లాభాల బోనస్ చెల్లింపు
నవంబర్ 1న దీపావళీ బోనస్, ఈ నెల 8న పండుగ అడ్వాన్స్ చెల్లింపు
ఈ మూడింటి ద్వారా సగటున కార్మికునికి రూ. లక్షా 15 వేల వరకూ చెల్లింపులు
లాభాల బోనస్ రూ. 79.07 కోట్లు, దీపావళి బోనస్ రూ. 300 కోట్లు చెల్లిస్తున్న కంపెనీ
ఒక ప్రకటనలో తెలిపిన సంస్థ ఛైర్మన్,ఎండి శ్రీధర్
హైదరాబాద్ : సింగరేణీ కార్మికులకు మరో గుడ్‌న్యూస్. ఈ నెల 11వ తేదీన సంస్థ అర్జించిన లాభాల్లో 29 శాతం వాటా రూపంలో బోనస్ అందుకోనుండగా, నవంబర్ 1వ తేదీన దీపావళి బోనస్‌కు కూడా తీసుకోనున్నారు. దీంతో కేవలం 20 రోజుల వ్యవధిలోనే రెండు బోనస్‌లు స్వీకరించనున్నారు. ఈ డబుల్ బొనాంజతో కార్మికులు ఆనందంతో తబ్బుబ్బి అవుతున్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కార్మికులకు ప్రకటించిన 29 శాతం లాభాల బోనస్ సొమ్మును ఈ నెల 11వ తేదీన చెల్లిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్, ఎండి శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
29 శాతం లాభాల బోనస్ కింద కంపెనీ రూ.79.07 కోట్లను కార్మికులకు పంపిణీ చేస్తుందని తెలిపారు. అలాగే ఇటీవల ప్రకటించబడిన దీపావళి బోనస్ (ప్రొడక్షన్ లింక్డ్ రివార్డ్ బోనస్)ను నవంబర్ 1వ తేదీన కార్మికుల ఖాతాల్లో జమచేస్తున్నట్లు తెలిపారు. ఈ బోనస్ చెల్లింపు కోసం సంస్థ రూ.300 కోట్ల రూపాయలను వెచ్చిస్తోందన్నారు. ఈ బోనస్ కింద ప్రతి కార్మికుడు రూ.72,500లను అందుకోనున్నాడని తెలిపారు. పై రెండు బోనస్‌ల చెల్లింపుకు సింగరేణి రూ.379.07 కోట్లను వెచ్చిస్తుందన్నారు. కాగా సింగరేణి సంస్థ పండుగ అడ్వాన్స్ కింద ప్రతి కార్మికుడికి రూ. 25వేలను ప్రకటించిందన్నారు. దీనిని ఈ నెల 8వ తేదీన చెల్లించనుందని తెలిపారు.
పైరెండు రకాల బోనస్‌లు, పండుగ అడ్వాన్స్ కలిపి కార్మికులు సగటున సుమారు ఒక లక్షా 15 వేల రూపాయల వరకు రానున్న మూడు వారాల్లో అందుకోనున్నారన్నారు. ఈ మొత్తాన్ని దుబారా చేయకుండా వినియోగించుకోవాలని, పొదుపు చేయడం లేదా గృహావసరాలకు వాడుకోవాలని శ్రీధర్ కోరారు. అలాగే రానున్న రోజుల్లో మరింతంగా ఉత్సాహంగా, కలిసిగట్టుగా పనిచేస్తూ నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని, తద్వారా ఈ ఏడాది మరింత మెరుగైన బోనస్‌లు, సంక్షేమం అందుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకార్మికులకు వారి కుటుంబ సభ్యులకు దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.