కోచ్చి: ప్రముఖ కార్టూనిస్టు సిజె ఏసుదాసన్ బుధవారం తెల్లవారుజామున ఇక్కడి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కొవిడ్ తదనంతర అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఎర్నాకుళం ప్రెస్ క్లబ్ అధికారులు వెల్లడించారు. 83 సంవత్సరాల ఏసుదాసన్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కార్టూనిస్టు ఏసుదాసన్‌గా ప్రసిద్ధులైన ఆయన వారం రోజుల క్రితం కొవిడ్-19 నుంచి కోలుకున్నారు. అయితే..కొన్ని అనారోగ్య సమస్యలు తెలెత్తడంతో ఆయనను తిరిగి ఆసుపత్రిలో చేర్చారు. బుధవారం తెల్లవారుజామున 3.45 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు.
రాజకీయ కార్టూన్లు గీయడంలో ఏసుదాసన్‌కు మంచి గుర్తింపు ఉంది. కేరళ ప్రభుత్వం నుంచి అనేక సార్లు ఆయన ఉత్తమ కార్టూనిస్టు అవార్డు స్వీకరించారు. అంతేగాక స్వదేశాభిమాని అవార్డు, బిఎం గఫూర్ అవార్డు, వి సాంబశివన్ మెమోరియల్ అవార్డు, పికె మంత్రి మెమోరియల్ అవార్డు, ఎన్‌వి పైలీ అవార్డు వంటి ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకున్నారు. అలప్పుళ జిల్లాలోని భరైక్కవులో 1938లో జన్మించిన ఏసుదాసన్ మలయాళ మనోరమలో సుదీర్ఘ కాలం కార్టూనిస్టుగా కొనసాగారు. ఆయన తన వృత్తి జీవితం తొలినాళ్లలో జనయుగం, శంకర్స్ వీక్లీలో కూడా కొంతకాలం పనిచేశారు. ఏసుదాసన్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.