Sunday, November 24, 2024

పసికందుల చోరీ ముఠా పట్టివేత

- Advertisement -
- Advertisement -
Police busted child trafficking racket in bangalore
పలు రాష్ట్రాలలో కంసపర్వం
ఆసుపత్రుల నుంచి అపహరణ
లక్షలలో బేరాల అమ్మకాలు

బెంగళూరు : పసికందులను ఎత్తుకెళ్లి, వారిని అమ్ముకుంటూ డబ్బు గడిస్తున్న ఓ అంతరాష్ట్ర ముఠాను స్థానిక పోలీసు బృందం ఛేదించింది. ఈ గ్యాంగ్‌ను పట్టుకుని 15 మంది పసికందులను అమ్మకానికి గురికాకుండా కాపాడింది. తల్లిదండ్రులకు అప్పగించింది. ఐదేళ్ల వ్యవధిలో ఈ గ్యాంగ్ ఇప్పటివరకూ 28 మంది నవజాత శిశువులను అమ్మివేసి సొమ్ముచేసుకుందని ఇప్పుడు వెల్లడైంది. పది రోజుల నుంచి మూడు నెలల లోపు శిశువును రూ 3 లక్షల నుంచి రూ పది లక్షల లోపు వరకూ అమ్మినట్లు స్పష్టం అయింది. గత ఏడాది బెంగళూరు ప్రధాన మున్సిపల్ ఆసుపత్రి (బిబిఎంపి)లో అప్పుడే పుట్టిన ఓ శిశువు చోరీ ఘటన క్రమంలో జరిగిన భారీ స్థాయి దర్యాప్తుతో ఈ అంతరాష్ట్ర శిశు చోరీ ముఠా క్రమం వెలుగులోకి వచ్చింది. పోలీసుల నిరంతర దర్యాప్తు క్రమంలో ఈ గ్యాంగ్‌ను పట్టుకున్నారు.

ఇప్పటివరకూ గ్యాంగ్‌కు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద అమ్మకానికి సిద్ధంగా ఉన్న దాదాపు 15 మందిని కాపాడారని వెల్లడైంది. ఈ అమానుష చర్యల గ్యాంగ్‌కు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళలలో తగు విధమైన నెట్‌వర్క్ ఉంది. సర్కారు ఆసుపత్రులు ఎంచుకుని, పేద స్త్రీల కాన్పుల అనంతరం అదును చూసుకుని ఆసుపత్రుల నుంచి పిల్లలను ఎత్తుకెళ్లుతున్నట్లు దర్యాప్తు క్రమంలో తేల్చారు. ఈ గ్యాంగ్‌కు మూల వ్యక్తిగా విజయనగర్‌కు చెందిన మహిళ రత్న అని వెల్లడైంది. ఈ వ్యక్తి కరోనాతో ఇటీవలే మృతి చెందారు. ఇక అరెస్టు అయిన వారిని బెంగళూరుకు చెందిన దేవీ షణుగ్మం, రంజనా దేవీ దాస్, మహేష్ కుమార్, ధనలక్ష్మీ, జనార్దన్‌లుగా గుర్తించారు. ఈ రాకెట్ ఇతర రాష్ట్రాలలో కూడా విస్తరించుకుని ఉందని, సంబంధిత శిశు అక్రమ రవాణాపై ఇతర రాష్ట్రాల పోలీసుల సాయంతో మరింతగా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

సంతానం లేని దంపతులను గుర్తించడం, వారికి అప్పుడే పుట్టిన శిశువులను అందిస్తామని చెప్పి ముందే బేరాలు కుదుర్చుకుని తరువాత విక్రయించడం ఇందుకు సరైన విధంగా ఆసుపత్రులను ఎంచుకోవడం ఈ గ్యాంగ్ వ్యూహంగా ఉంటూ వస్తోంది. ఆసుపత్రులలో నుంచే ఎక్కువగా పసికందులను ఎత్తుకెళ్లడం ఇందుకు ఎక్కువగా మహిళలను రంగంలోకి దింపడం, కొన్ని సందర్భాలలో కాలనీల్లోని, ఇళ్లలోని పిల్లలను ఎత్తుకెళ్లడం జరుగుతోందని వెల్లడైంది. అయితే కొన్ని కేసులలో తల్లిదండ్రుల ఇష్టంతో పసికందులను కొనుగోలు చేసుకుని తరువాత ఎక్కువ రేటుకు ఇతరులకు వారి సమ్మతితో బేరాల ద్వారా విక్రయించడం జరుగుతోంది. అయితే ఇది కూడా అత్యంత దారుణం, అంతకు మించి అక్రమం , చట్టవ్యతిరేకం అని ఈ క్రమంలో సంబంధితులపై కఠిన చర్యలు తప్పవని బెంగళూరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు హరీష్ పాండే విలేకరులకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News