ఆస్ట్రేలియా క్రికెటర్ లీసా స్టాలేకర్
మెల్‌బోర్న్: సుదీర్ఘ కాలంగా ఐపిఎల్‌లో సన్‌రైజర్స్‌కు చిరస్మరణీయ సేవలు అందించిన డేవిడ్ వార్నర్‌ను ఫ్రాంచైజీ యాజమాన్యం ఘోరంగా అవమానించడం తనను ఎంతో ఆవేదనకు గురి చేసిందని ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత లీసా స్టాలేకర్ వాపోయింది. పలు సీజన్‌లలో సన్‌రైజర్స్‌ను ముందుండి నడిపించిన ఘనత వార్నర్‌కు మాత్రమే దక్కుతుందని, అందుకు అతని కెప్టెన్సీలో సాధించిన విజయాలే నిదర్శనమని పేర్కొంది. అలాంటి క్రికెటర్ పట్ల సన్‌రైజర్స్ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సమంజసంగా లేదని ఆరోపించింది. హైదరాబాద్ జట్టుకు వార్నర్ అందించిన సేవలు అసమానమైనవని, అలాంటి క్రికెటర్ విషయంలో జట్టు యాజమాన్యం అవమానకరంగా ప్రవర్తించడం బాధాకరమని వ్యాఖ్యానించింది. వార్నర్ సారథ్యంలోనే సన్‌రైజర్స్ 2016లో ఐపిఎల్ ట్రోఫీని సాధించిన విషయాన్ని మరువకూడదని స్టాలేకర్ గుర్తు చేసింది. ఇప్పటికైనా జట్టు యాజమాన్యం వార్నర్‌పై తమ వైఖరిని మార్చుకుని అతనికి కనీసం ఒక మ్యాచ్‌లోనైనా ఆడే అవకాశం కల్పించాలని స్టాలేకర్ సూచించింది.