న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌కుమార్‌మిశ్రా బుధవారం హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. లఖీంపూర్‌ఖేరీ ఘటనలో తన కుమారుడు ఆశిష్‌మిశ్రాపై హత్యా నేరం కింద కేసు నమోదైన తర్వాత అమిత్‌షాతో మిశ్రా భేటీ కావడం ఇదే మొదటిసారి. లఖీంపూర్‌లో ఆదివారం జరిగిన ఘటన గురించి అమిత్‌షాకు మిశ్రా వివరించినట్టు తెలుస్తోంది. లఖీంపూర్ ఘటన నేపథ్యంలో మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మిశ్రా మొదట నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయానికి వెళ్లి అర్ధగంటపాటు అక్కడ గడిపారని అధికారికవర్గాలు తెలిపాయి.
ఆ తర్వాత ఆయన అమిత్‌షా నివాసానికి వెళ్లి ఘటన గురించి వివరించారు. షా నివాసంలోనూ అర్ధగంటపాటు మిశ్రా ఉన్నారు. తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలను మిశ్రా ఖండిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో వాహనంలో తన కుమారుడు లేడని ఆయన చెబుతున్నారు. అదీగాక ఆందోళనకారులు రాళ్లు విసరడం వల్లే వాహనం అదుపు తప్పి రైతులపైకి వెళ్లిందంటున్నారు. నలుగురు రైతులు ఈ ఘటనలో మృతి చెందగా, ఆందోళనకారుల దాడిలో వాహనంలోని డ్రైవర్‌సహా మరో నలుగురు చనిపోయారన్నది మిశ్రా వివరణ