స్టాక్‌హోం: శరణార్థుల వ్యథలకు అక్షర రూపం ఇచ్చిన టాంజానియా నవలా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నా(73)ను ఈసారి సాహిత్య రంగంలో నోబెల్ వరించింది.అబ్దుల్ రజాక్ గుర్నా హిందూ మహాసముద్రంలోని జాంజిబర్ ద్వీపంలో 1948లో జన్మించారు. కానీ 1960 దశకం చివర్లో ఇంగ్లాండ్‌కు శరణార్థిగా వెళ్లారు. 1963లో బ్రిటిష్ వలసపాలన నుంచి జాంబిబర్ స్వాతంత్య్రం పొంది టాంజానియాలో భాగం అయింది. కానీ ఆబిద్ కరుమే పాలనలో అరబ్ వర్గంపై పెరిగిన వివక్షను తట్టుకోలేక రజాక్ ఇంగ్లాండ్‌కు వెళ్లిపోయారు. అప్పుడాయన వయస్సు 18 ఏళ్లు మాత్రమే. అక్కడే ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన కేంట్రబేరిలోని కెంట్ యూనివర్సిటీలో సాహిత్య ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
ఓ శరణార్థిగా, ప్రవాసుడిగా జీవితంలో అనుభవించిన కష్టనష్టాలను, సాంస్కృతిక భేదభావలకు ఆయన అక్షర రూపం ఇచ్చారు. 21 ఏళ్ల వయస్సు నుంచే నవలలు రాశారు. దాదాపు 10 నవలలు, అనేక చిన్న కథలు రాశారు. 1994లో రాసిన ఆయన నవల ‘ప్యారడైజ్’ బుకర్ ప్రైజ్‌కు ఎన్నికయింది. ఆయన రాసిన ‘డిసర్షన్’ నవల కూడా బాగా పేరు సంపాదించుకుంది. 1.14మిలియన్ అమెరికా డాలర్ల బహుమతిని ఆయన గెలుచుకున్నారు.