ప్రధానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్
కోట(రాజస్థాన్): ముడుపుల కోసం ఉపయోగిస్తున్న రూ. 500, రూ. 2,000 కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ బొమ్మను తొలగించాలని రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ప్రధాని నరేంద్ర మోడీని డిమాండ్ చేశారు. 2019 జనవరి నుంచి 2020 డిసెంబర్ 31 మధ్యన సరాసరి రోజుకు రెండు కేసుల చొప్పున మొత్తం 616 లంచాల కేసులు నమోదయ్యాయని కుందన్‌పూర్ ఎమ్మెల్యే భరత్ సింగ్ ప్రధానికి రాసిన లేఖలో తెలిపారు. పెద్ద నోట్లపై మహాత్ముని ఫోటోకు బదులుగా ఆయనకు చెందిన కళ్లజోడును ముద్రించాలని మహాత్మా గాంధీ 152వ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రధానికి రాసిన లేఖలో ఆయన కోరారు. పేద ప్రజలు అత్యధికంగా ఉపయోగించే రూ. 5, రూ 10, రూ 50, రూ 100, రూ. 200 కరెన్సీ నోట్లపై మాత్రమే గాంధీ చిత్రాన్ని ముద్రించాలని ఆయన సూచించారు. బార్లలో కూడా మహాత్ముని ఫోటోతో ఉన్న పెద్ద నోట్లను వివిరిగా ఉపయోగిస్తున్నారని, ఇది గాంధీని అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు.