కెఆర్‌ఎంబిని కోరిన ఇఎన్‌సి మురళీధర్
గురువారం నాడు హైదరాబాద్‌లో కృష్ణ,గోదావరి నదీ బోర్డుల చైర్మన్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన కేంద్ర జలవనరుల శాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ
గెజిట్ నోటిఫికేషన్ అమలుపై త్వరలో కేంద్రానికి నివేదిక
12న కృష్ణ బోర్డు ప్రత్యేక సమావేశం
మనతెలంగాణ/ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్యన నదీజలాల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను అమలు పరచాల్సిన గడువు సమీపిస్తుండటంతో కేంద్రం అందుకు సంబంధించిన ముందస్తు ప్రక్రియను వేగవంతం చేసింది. కేంద్ర జలవనరుల శాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ గురువారం నాడు హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. కృష్ణానదీయాజమాన్య బోర్డు ఛైర్మన్ ఎంపి సింగ్ , గోదావరి నదీయాజమాన్య బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌లతో జలసౌధలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కృష్ణా, గోదావరి నదుల పరివాహకంగా పరిధిని నిర్ణయిస్తూ, నిర్మించిన , నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెస్తూ ఈ ఏడాది జులై 15న కేంద్ర జలవనరుల శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ అమలుకు అవసరమైన అన్ని పనులు పూర్తి చేసేందుకు మూడు నెలల పాటు సమయం కేటాయించింది. గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న అంశాలకు సంబంధించి అభ్యంతరాలు, మార్పులు , చేర్పులు తెలియ పరిచేందుకు తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్రం తగిన సమయం ఇచ్చింది. కేంద్ర జలవనరుల శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఈ నెల 14నుంచి అమల్లోకి రావాల్సివుంది. ఈ నేపద్యంలో కేంద్ర జలవనరుల శాఖ అదనపు కార్యదర్శి ముఖర్జీ నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై సమగ్రంగా చర్చంచారు. ఇప్పిటికే గెజిట్ అమలుకు తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులతో నిర్వహించిన సమావేశాలు, ఈ సమావేశాల్లో రెండు రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు తదితర అంశాలను కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లు కేంద్ర అదనపు కార్యదర్శి ముఖర్జీకి వివరించారు. రెండు రాష్ట్రాల నుంచి ప్రాజెక్టుల వారీగా సేకరించిన సమాచారం కూడా ముఖర్జీకి అందచేశారు.
రెండు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదుల పరివాహకంగా ఉన్న కొన్ని ప్రాజెక్టులను గెజిట్ నోటిఫికేషన్‌లోని రెండవ షెడ్యూల్ నుంచి తొలగించాలని రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను కూడా ఈ సమావేశంలో వివరించారు. రెండు రాష్ట్రాలనుంచి ప్రాజెక్టుల వారీగా అందిన డిపిఆర్ నివేదికలను కూడా ముఖర్జీ ముందు వుంచారు,, గెజిట్ నోటిఫికేషన్‌కు అమలుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లను , అందుకు అవసరమైన ముందస్తు కసరత్తులు తదితర అంశాలను కూడా ఈ సందర్బంగా ముఖర్జీ సమీక్షించారు. బోర్డు చైర్మన్లు సమీక్షలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అందచేసిన వివరాలను కేంద్రం దృష్టికి తీసుకుపోనున్నట్టు ముఖర్జీ సమావేశంలో వెల్లడించారు. కృష్ణా, గోదావరి బోర్డుల వారీగా నివేదికలను రూపొందించి త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి అందచేయనున్నట్టు కేంద్ర జలవనరుల శాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ పేర్కొన్నారు.
12న కృష్ణాబోర్డు ప్రత్యేక సమావేశం
గెజిట్ నోటిఫికేషన్ అమలుకు గడువు దగ్గర పడటంతో ఇంకా మిగిలిన పనులు పూర్తి చేసేందుకు ఈ నెల 12న కృష్ణా నదీయాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి నది బేసిన్ పరిధిలో పెద్దగా అభ్యంతరాలు లేవు. అయితే కృష్ణాబేసిన్ పరిధిలోనే తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్యన నీటి కేటాయింపులు , నీటి పంపిణీ ,ప్రాజెక్టుల నిర్వహణ, బోర్డు పరిధితో పాటు వివిధ అంశాలపై భిన్నాభిప్రాయాలు, భిన్నమైన వాదనలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి బోర్డుకు ఇంకా మరికోంత సమాచారం అందాల్సివుంది. గత నెల చివరి వారంలో బోర్డు త్రిసభ్య కమిటి సమావేశం నిర్వహించి అన్ని అంశాలను చర్చించాలని నిర్ణయించినప్పటికీ భా రీ వర్షాల కారణంగా త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో 2న జరిగే సమావేశంలో అన్ని అంశాలను సమగ్రంగా చర్చించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
తాగునీటిలో 20శాతమే లెక్కించాలి : బోర్డుకు ఈఎన్సీ లేఖ
తెలంగాణ రాష్ట్రంలో తాగు నీటి అవసరాలకు వినియోగిస్తున్న నీటిలో 20శాతం నీటినే లెక్కలోకి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కృష్ణానదీయాజమాన్య బోర్డును కోరారు. ఈఎన్సీ గురువారం బోర్డు చైర్మన్ ఎంపికి సింగ్‌కు లేఖ రాశారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణానది జలాల్లో రాష్ట్రానికి కేటాయించిన తాగునీటిలో 20శాతమే లెక్కించాలని ఈఎన్సీ తెలిపారు. అయితే తాగునీటి అవసరాలకు వాడే నీటిలో 15శాతం నీటినే లెక్కలోకి తీసుకోవాలని ఇటీవల కేంద్ర జలసంఘం కూడా స్పష్టం చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 2051నాటికి పెరిగే జనాభాకు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని కృష్ణానదినుంచి 75.32టిఎంసిల నీటిని కేటాయించాలని బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్‌ను కూడా కోరినట్లు తెలిపారు. ఈ 75.32టిఎంసిల నీటి కేటాయింపుల్లో 20శాతం ప్రకారం తాగునీటికి 17.60టిఎంసిలనే లెక్కించాలని కూడా తెలిపినట్లు ఈ మేరకు ఈఎన్సీ మురళీధర్ కృష్ణాబోర్డుకు రాసిన లేఖలో వివరించారు.