ఉభయ సభలు నిరవధిక వాయిదా
ఏడు బిల్లులకు ఆమోదం
బిసి కులాల జనగణనపై తీర్మానం
మనతెలంగాణ/హైదరాబాద్ : శాసనసభ, శాసన మండలి సమావేశాలు గురువారం నాటితో ముగియటంతో ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. శాసన సభలో సంక్షమ శాఖలపై లఘు చర్చ ముగియగానే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు శాసన మండలిని కూడా నిరవధికంగా వాయిదా వేస్తన్నట్టు మండలి ప్రోటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి ప్రకటించారు. శాసనసభ వర్షాకాలపు ఎనిమిదివ సమావేశాలు సెప్టెంబర్ 24నుంచి ప్రారంభమై మొత్తం ఏడు రోజులపాటు జరిగాయి. సమావేశాలు ప్రారంభమైన రెండురోజులకే రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా తాత్కాలిక విరామం ప్రకటించాల్సి వచ్చింది.గత నెల 27నుంచి 30వరకు విరామం అనంతరం తిరిగి ఈ నెల ఒకటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ మొత్తం ఏడు రోజుల పాటు జరిగింది. ఈ సారి మొత్తం 37గంటల 5నిమిషాల పాటు సభను నిర్వహించినట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సభలో ప్రభుత్వం మొత్తం ఏడు బిల్లులను ప్రవేశపట్టగా సభ వాటికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
తెలంగాణ వస్తు సేవల పన్ను సవరణ బిల్లు, తెలంగాణ రాష్ట్ర పర్యాటకులపై , ప్రయాణీకులపై దళారీతనం దుష్ప్రవర్తనను నివారించే బిల్లు ,బిసిగణన ,పంచాయతీరాజ్ సవరణ బిల్లు, భారతీయ స్టాంపుల బిల్లు తదితర బిల్లులకు ఉభయ సభల్లో ఆమోదం లభించింది. అసెంబ్లీలో బిసి కులాల జన గణనపై ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందింది. శాసన సభ సమావేశాల్లో ఈ సారి శాసనసభ్యులు వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి అడిగిన 27ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానాలు చెప్పారు. వివిధ శాఖలకు సబంధించి మొత్తం ఆరు అంశాలపై లఘు చర్చలు జరిగాయి.మరో వైపు శాసన మండలి సమావేశాలు కూడా ఏడు రోజుల పాటు జరిగాయి. సభ నిర్వహణ మొత్తం 23గంటల 32 నిమిషాల పాటు జరిగినట్టు మండలి ప్రోటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి వెల్లడించారు.