Friday, November 15, 2024

నిందితులను అరెస్టు చేయలేదేం?

- Advertisement -
- Advertisement -
SC angry over UP govt action in Lakhimpur incident
లఖింపూర్ ఘటనలో యుపి సర్కార్ చర్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టులో శుక్రవారం మరోసారి విచారణ జరిగింది. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై న్యాయస్థానం ఈ సందర్భంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితులను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. దీనిపై దసరా తర్వాత మరోసారి విచారణ చేపడతామని వెల్లడించింది. లఖింపూర్ ఖేరి ఉద్రిక్తల్లో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతంపై ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరపాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివకుమార్ త్రిపాఠి, ఎస్‌ఎస్ పాండా అనే న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. వీటిపై గురువారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. లఖింపూర్ ఖేరి ఘటనపై తీసుకున్న చర్యలను తెలియజేస్తూ స్థాయీ నివేదికను సమర్పించాలని యుపి ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు యుపి సర్కార్ శుక్రవారం న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది.

అయితే ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటికీ ఎందుకు అరెస్టు చేయలేదు? అని ప్రశ్నించింది. దేశంలో ఇతర హత్య కేసుల్లో నిందితులపై కూడా ఇలాంటి చర్యలే తీసుకుంటారా? అంటూ ఆగ్రహించింది. యుపి ప్రభుత్వం చర్యలు కేవలం మాటల్లోనే అని, దీనిద్వారా సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అని నిలదీసింది. సిట్‌లో ఉన్న వారంతా స్థానిక అధికారులేనని, అలాంటప్పుడు కేసు పురోగతి ఎలా ఉంటుందో అర్థమవుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చేతులు ముడుచుకుని కూర్చుంటామంటే కుదరదని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని వ్యాఖ్యానించింది. కాగా మృతుల శరీరంపై బులెట్ గాయాలు లేవని పోస్టుమార్టం నివేదికలో తేలిందని, యుపి ప్రభుత్వం తరఫున వాదించిన హరీశ్ సాల్వే కోర్టుకు విన్నవించారు.

ఆశిష్ విశ్రాను విచారించిన తర్వాత కచ్చితంగా చర్యలు తీసుకుంటామని, దోషులను వదిలేది లేదని, కచ్చితంగా సంతృప్తికరమైన చర్యలే తీసుకుంటామని రాష్ట్రప్రభుత్వం తరఫున ఆయన కోర్టుకు విన్నవించారు. కాగా హరీశ్ సాల్వే హామీపై కోర్టు సంతృప్తి వ్యక్తం చేస్తూ స్థాయీ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. సునిశిత పరిస్థితుల దృష్టా ప్రస్తుతం ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని, దీనిపై ఈ నెల 20న తుది విచారణ చేపడతామని బెంచ్‌వెల్లడించింది. మరో దర్యాప్తు సంస్థద్వారా విచారణ జరిపించాలా అనే దానిపై కూడా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. అప్పటిదాకా ఈ ఘటనలో సాక్షాలను భద్రంగా ఉంచాలని యుపి డిజిపికి తమ మాటగా చెప్పాలని ఆ హరీశ్ సాల్వేకు బెంచ్ సూచించింది.

తప్పుడు ట్వీట్‌పై సిజెఐ అసంతృప్తి

కాగా లఖింపూర్ ఖేరి హింసాకాండలో మృతుల కుటుంబ సభ్యులను సిజెఐ ఎన్‌వి రమణ కలిసారంటూ ఓ మీడియా సంస్థలో వచ్చిన ట్వీట్‌పై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము మీడియాను, దాని స్వేచ్ఛను గౌరవిస్తామని, అయితే ఇది ఎంతమాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ ట్వీట్ దురదృష్టకరమని వ్యాఖ్యానించిన బెంచ్ మీడియా వాస్తవాలేమిటో చెక్ చేసుకోవాలని వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా సిజెఐ లఖింపూర్ ఖేరి బాధితుల కుటుంబ సభ్యులను కలిసినట్లు గురువారం ఓ మీడియా సంస్థ ఒక ట్వీట్ ఉంచిందంటూ ఓ న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకు వచ్చినప్పుడు బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. మనమంతా కూడా బాధ్యతారహితమైన ట్వీట్ల బాధితులమేనని, తన గురించి కూడా ఇలాంటి తప్పుడు ట్వీట్లు కొన్ని వచ్చాయని సాల్వే అన్నారు. తాను కోర్టులో కూర్చుని ఉన్నానని, అలాంటప్పుడు తాను లక్నో వెళ్లి బాధిత కుటంబాన్ని ఎలా కలుస్తానో అర్థం కావడం లేదని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ అంటూ, దీన్ని అక్కడితో వదిలిపెట్టండని అన్నారు. ప్రజా జీవితంలో ఇలాంటివి తప్పవని కూడా అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News