వాహనాల వేగంపై త్వరలో పార్లమెంట్ ముందుకు బిల్లు
న్యూఢిల్లీ: ఎక్స్‌ప్రెస్‌వేలపై గంటకు 140 కిలోమీటర్ల వరకు వాహనాలకు అనుమతించడానికి వ్యక్తిగతంగా తాను అనుకూలమని కేంద్ర రవాణాశాఖమంత్రి నితిన్‌గడ్కరీ అన్నారు. వివిధ రకాల రోడ్లపై వాహనాల వేగ పరిమితులకు సంబంధించిన సవరణ బిల్లును త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఫోర్‌లేన్ రోడ్లపై గంటకు 100కిలోమీటర్లు, టూలేన్ రోడ్లపై 80, నగర రోడ్లపై 75 కిలోమీటర్ల వరకు అనుమతించాలని ఆయన అభిప్రాయపడ్డారు. రహదారులపై వేగానికి సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇప్పటికే కొన్ని తీర్పులిచ్చినందున తానేమీ చేయలేనన్నారు. అయితే, ప్రజాస్వామ్యంలో చట్టాల సవరణకు అవకాశమున్నదని ఆయన తెలిపారు. సవరణ బిల్లుకు సంబంధించిన ఫైల్ సిద్ధం చేస్తున్నామన్నారు. ఎక్స్‌ప్రెస్‌వేల విషయంలో ఆయన వివరణ ఇచ్చారు. అటువంటి రోడ్లను నిర్మించినపుడు, వాటికి రెండువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయాలని, కుక్క కూడా ఆ రోడ్డుపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.