Friday, November 15, 2024

ఇది మన తెలంగాణ.. మనందరి తెలంగాణ

- Advertisement -
- Advertisement -

CM KCR Debate on welfare in legislature

త్వరలో సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే పథకం
ఫసల్ బీమా బోగస్, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమంలోనూ వేగంగా ముందుకెళ్తున్నాం,అన్ని మతాలను గౌరవించాలన్నదే మా అభిమతం
కేంద్రం వద్ద నిధులు లేవు
తెలంగాణకు ఏమిస్తుంది?
శాసనసభలో సంక్షేమంపై చర్చ సందర్భంగా చేసిన సుదీర్ఘ ప్రసంగంలో ముఖ్యమంత్రి కెసిఆర్

భారతదేశ పూర్వ ప్రధాని, తెలంగాణ బిడ్డ, స్వర్గీయ పివి నరసింహారావు చిత్రపటాన్ని శుక్రవారం శాసనసభ భవనంలోని శాసనసభ్యుల లాంజ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్న భూపాల్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పివి నరసింహా రావు శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు, ఎంపి కె. కేశవరావుతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, శాసనసభ విపక్ష నాయకులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పివి నరసింహా రావు కుటుంబ సభ్యులు,లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు.

మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం రాష్ట్రాన్ని శపించవద్దని, ఇది మన తెలంగాణ.. మనందరి తెలంగాణ అని సిఎం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై శుక్రవారం శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సిఎం కెసిఆర్ వివరణాత్మక సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించి, అనుమానాలను నివృత్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి పనులు చేసినా కొందరు చిల్లరగా మాట్లాడుతున్నారని, అవన్నీ తాము పట్టించుకోవమని అన్నారు.

మీ జేబులో నుంచి ఇస్తున్నారా..? అని కొందరు ప్రశ్నిస్తున్నారని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కట్టే పనులను సమన్వయం చేసి తిరిగి ప్రజలకు ఎంత ఉజ్వలంగా, వారి అవసరాల కోసం ఎట్ల వాడుతామన్నది వారి నైపుణ్యంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాము మొదటి టర్మ్‌లో తక్కువ మెజార్టీతో గెలిచామని, రెండో టర్మ్‌లో మంచి మెజార్టీతో గెలిచామని చెప్పారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లనే ప్రజలకు తమను ఆశీర్వదించారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 32కు 32 జిల్లా పరిషత్లను గెలిచామని వెల్లడించారు. మున్సిపాలిటీల్లో 136 గెలిచామని, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్నామని అన్నారు. మిగతా కార్పొరేషన్లలోనూ టిఆర్‌ఎస్ పార్టే విజయం సాధించిందని చెప్పారు.

టిఆర్‌ఎస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజలకు అసెంబ్లీ వేదికగా సిఎం కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామా ల్లో వికాసం కనబడుతోందని అన్నారు. రాష్ట్రంలో అసైన్డ్‌భూములు ప్రభుత్వం తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చామని, ఒకవేళ తీసుకుంటే ఇతరులకు ఇచ్చిన మాదిరిగానే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పా మని తెలిపారు. పదేళ్లలో ఎంతో చేశామని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటుందని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. సంక్షేమంతో పాటు మూలధన పెట్టబడులు పెంచుతున్నామని పేర్కొన్నారు. హోంగార్డులకు దేశంలో మంచి జీతాలు ఇస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ పోలీసులకు రిస్క్ అలవెన్స్ ఇస్తున్నామని పేర్కొన్నారు. సచివాలంయలో గుడి, మసీదును గతంలో ఉన్న వాటి కంటే పెద్దగా, అందంగా నిర్మిస్తామని వెల్లడించారు.

ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లేలా చర్యలు

రాష్ట్రంలో ఎస్‌సిలు, ఎస్‌టిలు, బిసిలు వెనుకబడి ఉన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ఒసిల్లో కూడాపేదలు ఉన్నారని, అయితే ఒసిల్లో పేదల శాతం తక్కువగా ఉందని చెప్పారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, పదేళ్లలో ఎంతో చేశామని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుందని, కానీ ఫలితాలు కనిపించలేదని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో వేగంగా ముందుకెళ్తున్నామని వ్యాఖ్యానించారు. దీర్ఘకాలికమైన ప్రాజెక్టులు జరుగుతున్నాయని, పారిశ్రామిక రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నామన్నారు. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయని చెప్పారు. మక్కామసీదు రిపేర్ జరుగుతోందని, చర్చిలకు నిధులు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.

అన్ని మతాలను గౌరవించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ అభిమతమని .. అందుకే ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎంతో చేశామని చెప్పుకొనే గత ప్రభుత్వాలు బోనాల పండుగను ఎనాడైనా పట్టించుకున్నాయా..? అని ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ ప్రభు త్వం బోనాల పండగకు రూ .15 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. యాదాద్రి ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. మీకు వ్యవసాయం రాదు .. తెలివిలేదన్న ఎపి నుంచి మనం విడిపోయామని.. అలాంటి ఎపి తలసరి ఆదాయం రూ 1.70 లక్షలు ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం రూ . 2.37 లక్షలుగా ఉందని చెప్పారు. కేంద్రం తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణది రెట్టింపు ఉందని అన్నారు.

కాంగ్రెస్‌కు మేనేజ్‌మెంట్ స్కిల్స్ లేవు

కాంగ్రెస్‌కు మేనేజ్‌మెంట్ స్కిల్స్ లేవని, తమకు ఉన్నాయని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్నే పాలించిందని, కాంగ్రెస్ ఏమీ చేయలేదని తాము అనట్లేదని, మంచిగా చేయలేదని అంటున్నామని సిఎం కెసిఆర్ అన్నా రు. కాంగ్రెస్ కరెంట్, నీళ్లు ఇవ్వలేదని, తాము ఇస్తున్నామని అన్నారు. తాము శామీర్‌పేట వద్ద కొత్త రిజర్వాయర్ను ఏర్పాటు చేస్తున్నామని, మల్లన్నసాగర్ నుంచి నీళ్లు తీసుకువస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 20 వేల కోట్లు ఖర్చు పెట్టి.. నిరంతరాయ విద్యుత్ ఇస్తున్నామని పేర్కొన్నారు. దాంతో ప్రజలు ఆనందంగా ఉన్నారని చెప్పారు. ఎన్‌టిపిసి నుంచి 4 వేల మెగావాట్ల పవర్ స్టేషన్ ఫలితాలు అందుతాయి. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లు త్వరలోనే పూర్తవుతాయని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యుత్‌ను ఇవ్వగలుగుతున్నామని, దీంతో పెట్టబడులు తరలివస్తున్నాయి అని సిఎం కెసిఆర్ తెలిపారు. రాష్ట్రంలో పేద వర్గాలకు పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనే ఉద్దేశంతో కెజి టు పిజి కార్యక్రమానికి తానే రూపకల్పన చేశానని సిఎం చెప్పారు.

మంచి విద్యను అందిస్తే ప్రపంచంతో పోటీపడి బతుకుతారని భావించానని పేర్కొన్నారు. రాష్ట్రంలో గురుకులాలు ప్రారంభించడానికి ముందు ఈ విషయంపై విద్యారంగ నిపుణులు, మేధావులతో చర్చించానని తెలిపారు. ఐదవ తరగతి లోపు పిల్లలను గురుకులాల్లో వేస్తే హోం సిక్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు. మేధావులు, చైల్డ్ సైకాలజిస్టుల సూచనల మేరకే ఐదవ తరగతి నుంచి గురుకులాలను ప్రారంభించామన్నారు. ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. గురుకులాల్లో పెట్టే డైట్‌ను కూడా తానే రూపొందించానని చెప్పారు. దేశంలోనే ఎక్కడ లేనన్ని గురుకులాలు మన రాష్ట్రంలో ఉన్నాయని, నాణ్యమైన విద్యను అందిస్తూ.. కడుపునిండా భోజనం పెడుతున్నామని చెపారు. గురుకులాలకు పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. అంగన్‌వాడీలలో ప్లేస్కూల్ ప్రారంభించే విషయంపై కూడా చర్చించామని అన్నారు.

కాంగ్రెస్ పాలనలో పదేళ్లలో ఎస్‌సి వెల్ఫేర్ కోసం రూ. 6,198 కోట్లు ఖర్చు చేస్తే… తాము ఏడేండ్లలో రూ. 23,296 కోట్లు ఖర్చు చేశామని సిఎం కెసిఆర్ వెల్లడించారు. పదేళ్లలో ఎస్‌టి వెల్ఫేర్ కోసం రూ. 3,430 కోట్లు ఖర్చు పెడితే, తాము రూ.14,447 కోట్లు ఖర్చు చేశామని, బిసి వెల్ఫేర్ కోసం కాంగ్రెస్ రూ. 6,593 కోట్లు ఖర్చు పెడితే, టిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 19,535 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. మైనార్టీ వెల్పేర్ కోసం కాంగ్రెస్ రూ. 925 కోట్లు ఖర్చు చేస్తే, తమ ప్రభుత్వం రూ. 6,971 కోట్లు ఖర్చు చేసిందని, మహిళా, శిశు సంక్షేమం కోసం కాంగ్రెస్ రూ. 4,510 కోట్లు ఖర్చు చేస్తే,తాము రూ. 9,916 కోట్లు ఖర్చు చేశామని అన్నారు.పదేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ. 21,663 కోట్లు అయితే తమ ప్రభుత్వం రూ. 74,165 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.

రాజాసింగ్‌కు కెసిఆర్ చురకలు

బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్‌కు ముఖ్యమంత్రి కెసిఆర్ చురకలంటించారు.కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయన్న రాజాసింగ్ వ్యాఖ్యలపై సిఎం స్పందించారు. కల్యాణలక్ష్మి పథకం ప్రారంభంలో కొంతమంది లంచాలు తీసుకున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అప్పుడు రూ. 51 వేలు ఉండేదని తెలిపారు. తన దగ్గరి మిత్రుడి ఇంట్లో ఓ పిల్లాడు పని చేస్తాడని, ఆ పిల్లోడికి పెళ్లి అయిన తర్వాత కల్యాణలక్ష్మి చెక్ వచ్చిందా..? అని తన మిత్రుడు అడిగితే.. రూ. 51వేలకు బదులు.. రూ. 40 వేలు ఇచ్చారని అతను చెప్పాడని ఆయనొచ్చి తనకు చెప్పారని తెలిపారు. ఆ తర్వాత తానే ఎంఎల్‌ఎలతో సమావేశంలో ఏర్పాటు చేయగా, ఎంఎల్‌ఎలు కూడా అది నిజమే అని చెప్పారని పేరకొన్నారు.

అందుకే కల్యాణలక్ష్మి చెక్‌ల పంపిణీనీ ఎంఎల్‌ల సూపర్‌వైజింగ్‌లో పెట్టాలని నిర్ణయించామని చెప్పారు. ఎంఎల్‌ఎ సంతకం పెడితేనే చెక్ మంజూరు అవుతుందని, ఆ తర్వాత ఎంఎల్‌ఎ ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి చెక్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. రాజాసింగ్ …మీరే ఎంఎల్‌ఎ… మీకే సర్వాధికారాలు ఉన్నాయి… అలా జరుగుతుదంటే గవర్నమెంట్ కంటే మీకే ఎక్కువ అవమానం అని రాజాసింగ్ ఉద్దేశించి అన్నారు. అట్ల జరగనివ్వొద్దని, మీరంటే భయం లేదని అర్థమైతుందని సిఎం కెసిఆర్ రాజాసింగ్‌కు చురకలంగించారు. ఎంఎల్‌ఎల ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ చేసిన తర్వాత ఇలాంటి సమస్యలు రాలేదని, తొలిసారిగా వింటున్నానని చెప్పారు. అలాంటి తప్పు జరిగితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని సిఎం తెలిపారు.

తెలంగాణనే కేంద్రానికి ఇస్తుంది

కేంద్రం దగ్గరే నిధులు లేవు… ఇక తెలంగాణకు ఏం ఇస్తారు..? అని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. రాష్ట్రం హక్కు ప్రకారం కేంద్రం నుంచి రావాల్సింది వస్తుందని వివరించారు. కేంద్రం నుంచి ప్రత్యేకంగా వచ్చేదేమి లేదు. తెలంగాణనే కేంద్రానికి ఇస్తుందని స్పష్టం చేశారు. ఏడేళ్లలో కేంద్రం తెలంగాణకు 42 వేల కోట్లు ఇస్తే…తెలంగాణ కేంద్రానికి 2.74 లక్షల కోట్లు నిధులు ఇచ్చిందని తెలిపారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చేది లేదని మరోసారి ఉద్ఘాటించారు. దేశ ఖజానాకు నిధులు సమకూర్చేవి కేవలం నాలుగైదు రాష్ట్రాలేనని వెల్లడించారు. కేంద్రానికి నిధులు సమకూర్చే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని తెలిపారు. దేశానికి నిధులు సమకూర్చే ఉత్తమ రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటని ఆర్‌బిఐ తెలిపిందని అన్నారు. కేంద్రం అసలు ఇస్తే కదా.. నిధులు మళ్లించడం జరిగేదని ఎద్దేవా చేశారు. కేంద్రం ఇస్తుంది అని పిచ్చి లెక్కలు చెప్పకండని సూచించారు. బిజెపి నేతలు కేంద్రం నిధులిస్తోందన్న వాదన మానేయడం మంచిదని సూచించారు. కేంద్రం మనకంటే ఎక్కువ అప్పులు చేస్తోందని అన్నారు.

డయాలసిస్ సెంటర్లు పెంచుతాం

రాష్ట్రంలో డయాలసిస్ సెంటర్లు మరిన్ని పెంచుతామని సిఎం ప్రకటించారు. హైదరాబాద్‌లో ఇదివరకు మూడు డయాలసిస్ కేంద్రాలు ఉంటే వాటికి 38కి పెంచామని, దాంతో ప్రస్తుతం డయాలసిస్ కేంద్రాలు 41కి చేరానని అన్నారు. మిషన్ భగీరథ వల్ల కిడ్నీ జబ్బులు కూడా తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సాదాబైనామాలు, అక్రమ నిర్మాణాలపై పేదలకు మరోసారి అవకాశం కల్పిస్తామని, ఈ విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సిఎం కెసిఆర్ వెల్లడించారు.

వక్ఫ్ భూములపై ఏడాదిలోగా విచారణ పూర్తి

వక్ఫ్ భూములపై ఏడాదిలోగా సిబిసిఐడి విచారణ పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని సిఎం కెసిఆర్ వెల్లడించారు. వక్ఫ్ భూముల విచారణ ఆరు నెలలు లేదా ఏడాది లోగా పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ కోరగా, దానిపై సిఎం స్పందిస్తూ ఏడాదిలోగా పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు.

త్వరలో సొంతభూమిలో ఇల్లు కట్టుకునే పథకం

రాష్ట్రంలో సొంతభూమిలో ఇల్లు కట్టుకునే పథకం త్వరలో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. త్వరలోనే ఈ పథకం విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. గత ఎన్నికల సమయంలో తాను హామీ ఇచ్చానని, ఆ మేరకు ఎంఎల్‌ఎలు కూడా అడుగుతున్నారని తెలిపారు. నియోజకవర్గానికి వెయ్యి లేదా 1500 ఇళ్లకు అవకాశం ఇస్తామని తెలిపారు.

రోశయ్య అసెంబ్లీలోనే ఉరేసుకుంటా అంటే మేం వద్దన్నాం

టిఆర్‌ఎస్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి కెసిఆర్ కడిగిపారేశారు. గతంలో రోశయ్య విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ వ్యవస్థను మంచిగా చేసి చూపిస్తా…లేదంటే శానససభలో అసెంబ్లీలోనే ఉరేసుకుంటానని రోశయ్య అన్నారని, ఆయన తన సూట్‌కేసులో ఉరితాడు కూడా తెచ్చుకున్నారని…తామందరం వారించి వద్దని చెప్పామని కోరామని గుర్తు చేశారు. ప్రపంచ మేధావి కూడా కరెంట్ ఇస్తానని ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఇది ప్రజలకు తెలుసని, కాంగ్రెస్ నాయకులు పదేపదే మాట్లాడితే వారే దెబ్బతింటారని అన్నారు.

ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి తీసుకునే అంశాన్ని పరిశీలిస్తాం

రాష్ట్రంలో ఎన్‌ఆర్‌ఇజిఎస్ కింద పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాకే నిధుల వినియోగం పెరిగిందని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగులు కాకపోయినా వారు ఉద్యోగులం అనుకుంటున్నారని,ఎవరో చెబితే ధర్నాలు చేశారని అన్నారు .వారిని ఉద్యోగాల నుంచి ఎవరూ తొలగించలేదని, వారికి వారే విధులకు హాజరుకావడం లేదని పేర్కొన్నారు. ఫీల్ అసిస్టెంట్లను మళ్లీ తీసుకునే అవకాశం పరిశీలిస్తామని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News