న్యూఢిల్లీ : లఖీంపూర్ ఖేరీ ఘటనపై రైతులు నిరసనల కదం తొక్కనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో రైతుల బలిపై నిరసన తెలిపేందుకు రైతులంతా ఈ నెల 12న లఖీంపూర్‌కు తరలిరావాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) శనివారం పిలుపు నిచ్చింది. ఈ రోజును షహీద్ కిసాన్ దివస్‌గా నిర్వహించడం జరుగుతుందని ఎస్‌కెఎం తెలిపింది. పలు రైతు సంఘాల సంయుక్త వేదికగా ఎస్‌కెఎం ఏర్పాటు అయింది. బిజెపి దౌర్జన్యానికి అధికార పక్షం జులుంకు నిరసనగా ప్రత్యేక ప్రార్థనా సమావేశాలు నిర్వహిస్తారు. లఖీంపూర్‌లో జరిగింది దారుణ అమానుషకాండ, జలియన్‌వాలాబాగ్‌ను మించిపోయింది. రైతులకు అంతా సంఘీభావం ప్రకటించాలి. ఈ రోజున అన్ని పౌర సంస్థలు కొవ్వొత్తులు వెలిగించి, సంఘీభావం వ్యక్తం చేయాలని స్వరాజ్ ఇండియా అధ్యక్షులు యోగేంద్ర యాదవ్ తెలిపారు. ఇక అక్టోబర్ 18న దేశవ్యాప్త రైల్‌రోకో ఉంటుంది. 26న లక్నోలో భారీ మహాపంచాయత్ నిర్వహిస్తారు.