బిఎస్పి అధినేత్రి మాయావతి డిమాండ్
లక్నో : ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే మీడియా సంస్థల పోల్‌సర్వేలను నిషేధించాలని బిఎస్పి అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఈ మేరకు తాము ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని శనివారం ఇక్కడ తెలిపారు. ఎటువంటి ఎన్నికలు అయినా ఫలితాలపై సర్వేలకు కళ్లెం పడాల్సి ఉంది. జనం నాడి పేరిట జరిగే ఫలితాల విశ్లేషణల ప్రభావం ఏ రాష్ట్రంపైనా పడరాదని మాయావతి స్పష్టం చేశారు. బిఎస్పి వ్యవస్థాపక నేత కాన్షీరామ్ 15వ వర్థంతి సందర్భంగా కాన్షీరామ్స్మారక్ స్థల్లో జరిగిన సమావేశంలో మాయావతి మాట్లాడారు. దివంగత దళితనేత కాన్షీరామ్‌కు భారతరత్న ఇవ్వాలని దళితుల పలు అణగారిన వర్గాల అభ్యున్నతి దిశలో కాన్షీరామ్ నిస్వార్థ సేవలు ఎనలేనివని తెలిపారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే యుపిలో రాజకీయ పరిస్థితి ఇప్పటికే స్పష్టం అయిందన్నారు.
రాష్ట్రంలో అధికార పక్షాన్ని మార్చేందుకు ఇప్పటికే ప్రజలు స్థిర నిర్ణయానికి వచ్చారని వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో పోల్ సర్వేలు రాజకీయాలను మించిన అనుంబంధ వ్యాపారాలు అయ్యాయని, కల్పిత సంకుచిత వైఖరులతో ప్రజలను ఇరకాటంలోకి నెట్టేందుకు యత్నిస్తున్నారని మాయావతి విమర్శించారు. ప్రజలను ప్రభావితం చేసే విధంగా జరిగే వ్యవహారం ఏదైనా ఎన్నికల అక్రమం అవుతుందని, ఈ దిశలో పక్షపాత ధోరణితో కూడిన పోల్ సర్వేలను అనుమతించడం భావ్యంకాదని ఆమె స్పష్టం చేశారు. ఒక్కరోజు క్రితమే ఓ న్యూస్ ఛానల్ సర్వే పేరిట ఫలితాలు వెల్లడించింది. ఇందులో ఉత్తరప్రదేశ్‌లో తిరిగి బిజెపినే అత్యధిక సీట్లను దక్కించుకుంటుందని జోస్యం చెప్పింది.
అధికార యంత్రాంగ దుర్వినియోగం
యుపిలో తిరిగి పాగాకు బిజెపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మాయావతి మండిపడ్డారు. కాషాయ పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడేందుకు అధికార బిజెపి ఇప్పటినుంచే కాదు ఎప్పటినుంచో అధికార యంత్రాంగాన్ని యధేచ్ఛగా వాడుకొంటోందని విమర్శించారు. కేంద్రంలో, రాష్ట్రంలో తమకు ఉన్న అధికారాన్ని వాడుకుంటూ బిజెపి ఇప్పటి నుంచే యుపిలో ఎన్నికల ప్రలోభాలకు దిగుతోందని, ఇటువంటి వాటిని నివారించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని మాయావతి తెలిపారు.