మొదటి విడతలో ఖాళీగా మిగిలిన సీట్లు 13,130
నెలాఖరులో దోస్త్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ రెండవ విడత కౌన్సెలింగ్ దసరా తర్వాత నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద మొత్తం 74,071 సీట్లు అందుబాటులోకి ఉండగా, మొదటి విడతలో 60941 సీట్ల కేటాయింపు జరిగింది. ఈ ఏడాది మొదటి దశలో 17,101 ఇంజనీరింగ్ సీట్లు ఖాళీగా మిగిలాయి. ఈసారి మొత్తం 175 కాలేజీల్లో 74,071 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా, 60,941 సీట్లు (82.27 శాతం) కేటాయించగా, 13,130 సీట్లు ఖాళీగా మిగిలాయి. మొదటి విడత కౌన్సెలింగ్‌లో అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోలేని కాలేజీలు తర్వాత ఆయా వర్సిటీల నుంచి అనుబంధ గుర్తింపు పొందాయి. దాంతో ఇంజనీరింగ్ సీట్లు పెరుగనున్నాయి. ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్‌లో కంప్యూటర్ సైన్స్ అనుబంధ బ్రాంచీల్లో వంద శాతం సీట్లు కేటాయించారు.
ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ ఛైన్ టెక్నాలజీ, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజి, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ మ్యాటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్(మెక్రోనిక్స్), ప్లానింగ్, బి.టెక్ మెకానికల్ విత్ ఎం.టెక్ థర్మల్ ఇంజనీరింగ్, బి.టెక్ మెకానికల్ విత్ ఎం.టెక్ థర్మల్ సిస్టమ్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్. బయో టెక్నాలజి,డెయిరీయింగ్ కోర్సుల్లో వంద శాతం సీట్లు కేటాయించారు. మొదటి విడతలో మిగిలిన సీట్లతోపాటు రద్దు చేసుకున్న సీట్లను కూడా రెండో దశ కౌన్సెలింగ్‌లోకి తీసుకుంటారు. అప్పటికీ భర్తీ కానివి, రెండో దశలోనూ సీటు రద్దు చేసుకుంటే ఖాళీ అయ్యే సీట్లను స్పాట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేస్తారు.
31 కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ
ఎంసెట్ మొదటి విడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు రాష్ట్రంలో 31 కాలేజీల్లో 100 శాతం సీట్లు కేటాయించారు. అందులో యూనివర్సిటీ కాలేజీలు ముందు వరుసలో ఉన్నాయి. యూనివర్సిటీ కాలేజీల్లో మొత్తం 91.44 శాతం సీట్లు కేటాయించగా, అందులో 6 యూనివర్సిటీల్లో 100 సీట్లకు కేటాయింపులు జరిగాయి. 25 ప్రైవేట్ కాలేజీల్లో 100 సీట్లు భర్తీ అయ్యాయి.
డిగ్రీలో చేరిన విద్యార్థులు 1,96,691 మంది
రాష్ట్రంలో బిఎ,బికాం, బిఎస్‌సి వంటి డిగ్రీ కోర్సుల్లో ఈ ఏడాది కూడా సుమారు 2 లక్షలకు పైగా సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 947 కళాశాలల్లో 4,16,575 డిగ్రీ సీట్ల ప్రవేశాల కోసం ఇప్పటి వరకు మూడు విడతల ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ జరిగింది. మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థుల్లో 2,12,143 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయగా 1,96,691 మంది మాత్రమే కాలేజీలకు వెళ్లి చేరారు. భారీగా సీట్లు మిగలడం వల్ల మరో విడత ప్రవేశాలను చేపట్టాలని దోస్త్ అధికారులు భావిస్తున్నారు. ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ నెలాఖరున ప్రత్యేక విడత కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. అప్పటికీ మిగిలిన సీట్లను భర్తీ చేసుకొనే అవకాశం యాజమాన్యాలకు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి ఆలోచిస్తున్నట్లు తెలిసింది.