Thursday, October 24, 2024

రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -
Heavy rains for another two days in Telangana
ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం
ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు 1,035.1 మిల్లీమీటర్లు….
జూన్ నుంచి ఈనెల 09 వరకు హన్మకొండలో అధిక వర్షపాతం నమోదు

హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడగా అది ఆదివారం అల్పపీడనంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల పాటు వానలు పడతాయని అధికారులు తెలిపారు. చాలా ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అధికారులు తెలిపారు. మరోవైపు మనదేశంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ కొనసాగుతుండగా, రెండు రోజుల్లో ఉత్తర భారతం నుంచి రుతుపవనాలు వెళ్లిపోనున్నాయి. నైరుతి రుతుపవనాల తిరోగమనం నేపథ్యంలో పలు రాష్ట్రాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి. దీంతోపాటు తుఫాన్‌ల కారణంగా కురిసిన భారీ వర్షాలతో నదులు, చెరువులు, ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారిపోయాయి.

అప్రమత్తమైన డిజాస్టర్ మేనేజ్‌మెంట్

ఈ రెండు రోజుల పాటు ఆదిలాబాద్, కొమరం భీం అసిఫాబాద్, ములుగు, రాజన్న, సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలు చోట్ల కుండపోత వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరో రెండు రోజుల పాటు జిహెచ్‌ఎంసి పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు అప్రమత్తమయ్యారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో ఐదుగురు మృతి

జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అయిజ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి గుడిసె కూలి ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.మరో ఇద్దరు ప్రాణాలతో బయట పడ్డారు. మృతి చెందిన వారిలో ముగ్గురు చిన్నారులు, భార్యా భర్తలు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు గుడిసెలో మొత్తం ఏడుగురు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

హైదరాబాద్‌లో 98 మిల్లీమీటర్లు నమోదు

రాష్ట్రవ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 98 మిల్లీమీటర్లు, మేడ్చల్ మల్కాజిగిరిలో 88, యాదాద్రి భువనగిరిలో 74, నల్లగొండలో 73, ఆదిలాబాద్‌లో 49, ములుగులో 44, కుమురంభీం ఆసిఫాబాద్‌లో 44, రంగారెడ్డి 48, నారాయణపేటలో 64, నాగర్‌కర్నూల్‌లో 59, వనపర్తిలో 42, వికారాబాద్‌లో 22, మహబూబ్‌నగర్‌లో 20, కామారెడ్డిలో 10, సంగారెడ్డిలో 9.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

2021 మే వరకు రాష్ట్రంలో 1,096.5 మి.మీ. వర్షపాతం

రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. జూన్ 1న ప్రారంభమైన ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు 1,035.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణ స్థాయి (764.4 మి.మీ.) కంటే 35 శాతం అధికమని వాతావరణ శాఖ ప్రకటించింది. సిరిసిల్ల, సిద్దిపేట, హన్మకొండ, నారాయణపేట, కరీంనగర్ జిల్లాల్లో సాధారణ స్థాయి కంటే అధిక వర్షపాతం నమోదయ్యిందని అధికారులు తెలిపారు. గద్వాల, పెద్దపల్లి, సూర్యాపేట, ములుగు, నాగర్‌కర్నూలు, మంచిర్యాల జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. గత సీజన్‌లో (2020 జూన్ నుంచి 2021 మే వరకు) రాష్ట్రంలో 1,096.5 మి.మీ. వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది.

హన్మకొండలో 72 శాతం అధికం…

జూన్ నుంచి అక్టోబర్ 09వ తేదీ వరకు జిల్లాల వారీగా వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అన్ని జిల్లాలోనూ సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాజన్న సిరిసిల్లలో 1,407.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా ఈ సీజన్‌లో సాధారణం కన్నా అధికంగా 35 శాతం వర్షపాతం నమోదయ్యింది. హన్మకొండలో 1,277.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా 72 శాతం అధికంగా, నారాయణపేటలో 779.3 మి.మీలకు గాను 65 శాతం అధికంగా, కరీంనగర్‌లో 1,233.7కు గాను 63 శాతం అధికంగా, రంగారెడ్డిలో 827.1 మి.మీలకు గాను 49 శాతం అధికంగా, వరంగల్‌లో 1,284.2 మి.మీలగాను 47 శాతం అధికంగా, యాదాద్రి భువనగిరిలో 863.1 మి.మీలకు గాను 43 శాతం అధికంగా, జగిత్యాలలో 1,263 మి.మీలకుగాను 42 శాతం అధికంగా, మేడ్చల్ మల్కాజిగిరిలో 825.4 మి.మీలకు గాను, 36 శాతం అధికంగా, హైదరాబాద్‌లో 804.4 మి.మీలకు గాను, 30 శాతం అధికంగా, సంగారెడ్డిలో 904.8 మి.మీలకు గాను 22 శాతం అధికంగా, ఖమ్మంలో 1,040.1 మి.మీలకుగాను 22 శాతం అధికంగా, జయశంకర్ భూపాలపల్లిలో 1,181.4 మి.మీలకు గాను 22 శాతం అధికంగా, ములుగులో 1,220.9 మి.మీలకు గాను 7 శాతం, మంచిర్యాలలో 1,025 మి.మీలకు గాను 1 శాతం అధిక వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News