హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపును స్వాగతిస్తున్నానని ప్రకాశ్‌రాజ్ అన్నారు. మా ఎన్నికల ఫలితాల అనంతరం సోమవారం ప్రకాశ్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ”ఎన్నికలు సజావుగా సాగాయి. చైతన్యంతో ఎక్కువ మంది ఓట్లు వేశారు. తెలుగు బిడ్డను ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. గెలిచిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు. ‘మా’తో నాకు 25 ఏళ్ల అనుబంధం ఉంది. నేను తెలుగు వాడిని కాదు. నా తల్లిదండ్రులు తెలుగు వారు కాదు.. అది నా తప్పుకాదు, వారి తప్పు కాదు. మా సభ్యత్వానికి నేను రాజీనాబా చేస్తున్నాను. అతిథిగా వచ్చాను.. అతిథిగానే ఉంటాను. ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదు. ఇతర సినీ పరిశ్రమల నుంచి వచ్చిన వారు ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా మార్గదర్శకాలు రూపొందిస్తామని మంచు విష్ణు ప్యానెల్ ఎన్నికలకు ముందు ప్రకటించింది. కళాకారుడిగా నాకు ఆత్మగౌరవం ఉంది. ఇలాంటి ఎజెండా ఉన్న ‘మా’లో పని చేయడం నాకు ఇష్టం లేదు. ప్రాంతీయ, జాతీయవాదం నేపథ్యంలో ఈ ఎన్నిక జరిగింది. నా ఓటమికి ప్రాంతీయవాదంతో పాటు పలు కారణాలు ఉన్నాయి” అని పేర్కొన్నారు.
Prakash Raj Press meet after MAA Polling Results