ముంబయి: క్రూయిజ్‌షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు షారూఖ్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు ఈ నెల 13న(బుధవారం) విచారణ చేపట్టనున్నది. ఆలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో(ఎన్‌సిబి)ని ప్రత్యేక కోర్టు జడ్జి వివి పాటిల్ ఆదేశించారు. సోమవారం ఈ అంశంపై ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టగా, ఎన్‌సిబి తరఫు న్యాయవాదులు బెయిల్‌పై అంత తొందరేమీ లేదని, అఫిడవిట్ సమర్పణకు వారం రోజుల సమయం కావాలని కోరారు. అందుకు జడ్జి అనుమతించలేదు. ఆర్యన్‌ఖాన్ తరఫున న్యాయవాది అమిత్‌దేశాయ్ వాదన వినిపించారు. ఆర్యన్‌ఖాన్‌ను తప్పుడు కేసులో ఇరికించారని, ఆయనకు బెయిల్ నిరాకరించడం తగదని అమిత్ వాదించారు.
ప్రస్తుతం ఆర్యన్‌ఖాన్‌ను ముంబయి ఆర్థర్‌రోడ్‌లోని జైలులో జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ఉంచారు. ఆర్యన్‌ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని, ఆయణ్ని ఇప్పటికే ఎన్‌సిబి రెండుసార్లు విచారించిందని అమిత్ గుర్తు చేశారు. ఆర్యన్‌కు బెయిల్ ఇవ్వడం వల్ల దర్యాప్తునకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. కాగా, ఆర్యన్‌పై డ్రగ్స్ కలిగి ఉండటం, వినియోగించడం, అమ్మడానికి సంబంధించిన సెక్షన్ల కింద ఎన్‌సిబి కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు 20మందిని ఎన్‌సిబి అరెస్ట్ చేసింది.