కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుతుండడానికి కారణంపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఉచితంగా కరోనా టీకాలు అందించడం వల్లనే చమురు ధరలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. పెట్రోలు అంత ఖరీదైనది కాదు. కేంద్రం, రాష్ట్రాలు దానిపై పన్నులు విధించాయి. మరో పక్క ప్రభుత్వం ప్రజలందరికీ కరోనా టీకాలు ఉచితంగా అందిస్తోంది. మీరు చెల్లించకుండా టీకాలకు డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది. ఈ పన్నుల నుంచే టీకా డబ్బులు వచ్చాయి. ఈ ప్రభుత్వం 130 కోట్ల మందికి ఉచితంగా టీకా ఇవ్వాలని లక్షంగా పెట్టుకుంది. ఒక్కో టీకా డోసు ధర రూ.1200. ఒక్కొక్కరికి రెండు డోసులు వేయాలని మంత్రి పేర్కొన్నారు. అలాగే హిమాలయన్ మంచినీళ్లకు , పెట్రోలుకు పోలిక చెబుతూ మరో వివరణ ఇచ్చారు. మీరు హిమాలయన్ మంచినీళ్లు తాగాలంటే ఒక బాటిల్‌కు రూ. 100 వెచ్చించాలి. పెట్రోలు కంటే దాని ధరే ఎక్కువ. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరిగితే అందుకు తగ్గట్టే పెట్రోలు, డీజిలు ధరలు పెరుగుతాయి. మా మంత్రిత్వశాఖ ఈ ధరల్ని నియంత్రించ లేదు. అది వాణిజ్యశాఖ పరిధి లోని విషయం అని అన్నారు.