Saturday, November 23, 2024

‘మా’ పేలుళ్లు

- Advertisement -
- Advertisement -

Chiranjeevi asked me to withdraw from MAA election:Vishnu

ఎన్నికల యుద్ధం ముగిసిపోగానే మరో సమరం

మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు
‘మా’ ఎన్నికలను ఏకగ్రీవంగా చేసేందుకు చిరు ప్రయత్నం
ప్రకాష్‌రాజ్ రాజీనామాను అంగీకరించను

మన తెలంగాణ/హైదరాబాద్‌ : ‘మా’ ఎన్నికల నుంచి చిరంజీవి నన్ను విత్ డ్రా చేసుకోమన్నారు అంటూ ‘మా’ అధ్యక్షుడిగా గెలుపొందిన మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి పోటీ నుంచి వైదొలగమన్నారు… చెప్పకూడదనుకున్నా, కానీ ఎన్నికలు అయిపోవడం వల్ల చెబుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం మంచు విష్ణు తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ “చిరంజీవి నన్ను పోటీ నుండి విత్‌డ్రా చేసుకోమన్నారు. ‘మా’ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు ఆయన నన్ను పోటీ నుండి తప్పుకోమన్నారు. ‘ప్రకాష్‌రాజ్ పోటీలో ఉన్నాడు కదా… విష్ణును పోటీ నుంచి తప్పుకోమని చెప్పొచ్చు కదా’అని నాన్నను చిరంజీవి అడిగారు. అయితే ఎన్నికలు జరగాల్సిందే అని నాన్న, నేను అనుకోవడం వల్ల పోటీలో నిల్చున్నాను.

ఇక రామ్‌చరణ్ నాకు మంచి మిత్రుడు. కానీ అతను ఓటు ప్రకాష్ రాజ్‌కే వేసి వుంటాడు. వాళ్ల నాన్న మాటను చరణ్ జవదాటడు. వ్యక్తిగత కారణాల వల్ల ఎన్టీఆర్ ఓటు వేయలేదు. నాగబాబు తన రాజీనామాను ఉపసంహరించుకోవాలి. ఆయన రాజీనామాను ఆమోదించను. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. మా నాన్న వల్లే నేను అధ్యక్షుడిగా గెలిచా. నాన్న మీద నమ్మకంతోనే నాకు ఓటేశారు. ఓటు వేసినవారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తా. శివాజీరాజా రాజీనామా చేస్తే ఒప్పుకోను. ‘మా’ సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా కృషి చేస్తాం. ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాక తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్‌లను కలుస్తాం. ‘మా’ సమస్యలు, చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం”అని అన్నారు.

ఆయన ‘మా’కు కావాలి…

“ప్రకాష్‌రాజ్ రాజీనామాను కూడా నేను అంగీకరించను. ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల నేను సంతోషంగా లేను. ప్రకాష్‌రాజ్ నాకంటే పెద్ద వారు. జీవితంలో గెలుపోటములనేవి ఒకే నాణేనికి రెండు వైపులా ఉంటాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ప్రకాష్ రాజ్ సలహాలు, సూచనలు కావాలి. రెండు, మూడు రోజుల్లో నేను ఆయనని కలుస్తాను. 260 మంది సభ్యులు ప్రకాష్‌రాజ్‌ని కోరుకున్నారు. కాబట్టి ఆయన ‘మా’కు కావాలి. శ్రీలంక, ఆప్ఘనిస్తాన్ నుంచి కూడా నటులు తెలుగుకి రావాలి. ఇండస్ట్రీకి ఏమి కావాలో అవి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి కోరతాను. త్వరలోనే వారిని కలుస్తాను” అని మంచు విష్ణు అన్నారు.

నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారుః మోహన్‌బాబు

సింహం నాలుగు అడుగులు వెనక్కేసిందని తేలిగ్గా చూడొద్దు
ఇండస్ట్రీ పెద్ద అనే హోదా నాకు వద్దు

“సింహం నాలుగు అడుగులు వెనక్కేసిందని తేలిగ్గా చూడొద్దు. వేదిక దొరికొంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా? నేను మాట్లాడిల్సింది చాలా ఉంది. దానికి సమయం ఉంది”అని మోహన్‌బాబు అన్నారు. నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు… మౌనంగా ఉన్నానని అనుకోవద్దు అని ఆయన పేర్కొన్నారు. మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ “తెలుగు రాష్ట్రాల్లో వివిధ పార్టీలు అధికారంలో ఉండవచ్చు. కానీ ‘మా’ అంత ఒకటే పార్టీ. దాసరి నారాయణ రావు లేని లోటును మనం భర్తీ చేయలేం. ఇండస్ట్రీ పెద్ద అనే హోదా నాకు వద్దు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహకారం మనకు కావాలి. నటీనటులకు సాయం చేయాలని ఇద్దరు సీఎంలను కోరతాం. కేసీఆర్‌ను నటీనటులు ఎప్పుడైనా సన్మానించారా? జగన్‌ను ఏ వేడుకకైనా ఆహ్వానించారా? చిత్ర పరిశ్రమ సమస్యలను ఇద్దరు ముఖ్యమంత్రులతో చర్చించాల్సిన అవసరం ఉంది”అని అన్నారు.

‘మా’కు రాజీనామా చేస్తున్నా ః ప్రకాష్‌రాజ్

అతిథిగా వచ్చా… అతిథిగానే ఉంటా

మంచు విష్ణు హామీలను నెరవేర్చాలి

‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకాశ్‌రాజ్ ప్రకటించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..“మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు సజావుగా సాగాయి. ఎన్నికల్లో ఈసారి ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంచు విష్ణు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నాను. రాజీనామా నిర్ణయం బాధతో తీసుకున్నది కాదు. తెలుగువాడిగా పుట్టకపోవడం నా దురదృష్టం. అతిథిగా వచ్చాను, అతిథిగానే ఉంటాను. ప్రాంతీయత ఆధారంగా ‘మా’ ఎన్నికలు జరిగాయి. మంచు విష్ణు గెలుపును స్వాగతిస్తున్నా”అని తెలిపారు.

ఆ బంధం సినిమాలతో కొనసాగుతుంది…

“మంచు విష్ణు, శివబాలాజీ, రఘుబాబుతో సహా గెలిచిన వారందరికీ పేరు పేరునా శుభాకాంక్షలు. మీరు అతి పెద్ద ప్రణాళికతో వచ్చారు. మీరిచ్చిన హామీలు నెరవేర్చండి. ప్రాంతీయత, జాతీయవాదం నేపథ్యంలో ‘మా’ ఎన్నికలు జరిగాయి. ‘తెలుగు వ్యక్తి కాని వాడు ఓటు వేయవచ్చు. కానీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు’ అనే నినాదం ప్రారంభించారు. అసోసియేషన్‌కు నాయకత్వం తెలుగువారికే ఉండాలని అన్నారు. దాన్ని ‘మా’ సభ్యులు ఆమోదించారు. తెలుగుబిడ్డ, మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు. దాన్ని నేను స్వాగతిస్తున్నా.

ఒక కళాకారుడిగా నాకంటూ ఆత్మగౌరవం ఉంటుంది. అందువల్ల ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నా. ప్రేక్షకులకు, నాకూ ఉన్న బంధం సినిమాలతో కొనసాగుతుంది. పెద్ద నటులు మోహన్‌బాబు, కోట శ్రీనివాస్, చలపతిరావు తనయుడు రవి వీళ్లంతా ‘అతిథిగా వస్తే, అతిథిగానే ఉండాలి’ అని చెప్పారు. అలాగే ఉంటా. మీరు అనుకున్నది జరిగింది. ‘మా’ ఎన్నికల్లో జాతీయవాదం వచ్చింది. బిజెపి నేత బండి సంజయ్‌లాంటి వాళ్లు ట్వీట్ చేశారు. ఎలా ఓడిపోయాం… ఎలా గెలిచాం అన్నది ముఖ్యం కాదు. ఎన్నికల్లో వాళ్లు గెలిచారు. ‘మా’తో నాది 21 ఏళ్ల అనుబంధం”అని ప్రకాష్‌రాజ్ పేర్కొన్నారు.

నేను నేనుగా ఉంటా…

“ఈ ఎన్నికలేమీ కురుక్షేత్ర సంగ్రామం కాదు. తెలుగు సినిమాల్లో నటించే విషయంలో నా అభిప్రాయం ఏమీ మారదు. తెలుగు కళాకారులతో కలిసి పనిచేస్తా. ఏ విషయంలోనైనా నాకు ఏకగ్రీవం నచ్చదు. బహుశా వచ్చే ఎన్నికల నుంచి మోహన్‌బాబు చెప్పినట్లు ఏకగ్రీవం జరుగుతుందేమో. నాకు అందులో భాగస్వామ్యం అవడం ఇష్టం లేదు. నేను యూనివర్సల్ నటుడిని. తెలుగువారు కాని నటులు సినిమాల్లో చేయొద్దని విష్ణు టీమ్ కూడా చెప్పలేదు. ‘మా’ ఎన్నికల్లో రాజకీయాలు వచ్చాయి. నాకు అబద్ధాలు చెప్పడం రాదు. నా దర్శకులు, నిర్మాతలు, ప్రేక్షకుల నుంచి దూరం చేస్తే చేయనీయండి. ఈ ఎన్నికల్లో నేనేమీ బాధితుడిని కాదు. సినిమాల పరంగా, పాత్రల పరంగా వచ్చే రెండు సంవత్సరాల్లో నేనేంటో చూస్తారు. అసోసియేషన్ వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు. నేను ‘మా’ సభ్యుడిని కాకపోయినా మంచు విష్ణు చేసే సినిమాల్లో నటించమంటే నాకేమీ అభ్యంతరం లేదు. నేను ఓడిపోవటానికి వంద కారణాలు ఉంటాయి. నేను నేనుగా బతికా. నేను నేనుగా ఉంటా.. ఇప్పుడే మొదలైంది..” ప్రకాష్‌రాజ్ అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News