Friday, November 22, 2024

గెలిచి నిలిచిన కోల్‌కతా

- Advertisement -
- Advertisement -

Kolkata Knight Riders beat Bangalore by 4 wickets

నరైన్ ఆల్‌రౌండ్ షో, క్వాలిఫయర్2కు నైట్‌రైడర్స్, కోహ్లి సేన ఇంటికి

షార్జా: ఐపిఎల్ సీజన్14లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోరాటం ముగిసింది. సోమవారం ఉత్కంఠభరితంగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 4 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. ఈ గెలుపుతో కోల్‌కతా క్వాలిఫయర్2కు దూసుకెళ్లింది. బుధవారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో నైట్‌రైడర్స్ తలపడుతుంది. ఇక ఈ ఓటమితో బెంగళూరు టైటిల్ రేసుకు దూరమైంది. ఈసారి ఎలాగైన ట్రోఫీని సాధించాలని భావించిన విరాట్ కోహ్లికి మరోసారి నిరాశే మిగిలింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్ శుభారంభం అందించారు. ధాటిగా ఆడిన గిల్ 18 బంతుల్లోనే 4 ఫోర్లతో 29 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి (6) నిరాశ పరిచాడు. సమన్వయంతో ఆడిన అయ్యర్ ఒక సిక్సర్‌తో 26 పరుగులు చేసి వెనుదిరిగాడు.

నరైన్ జోరు..

ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను నితీశ్ రాణా, సునిల్ నరైన్ తమపై వేసుకున్నారు. ఇద్దరు బెంగళూరు బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. రాణా ఒక ఫోర్, సిక్స్‌తో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. ధాటిగా ఆడిన నరైన్ 15 బంతుల్లోనే మూడు భారీ సిక్సర్లతో 26 పరుగులు చేసి సిరాజ్ వేసిన అద్భుత బంతికి ఔటయ్యాడు. చివర్లో బెంగళూరు బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ నెలకొంది. కానీ మోర్గాన్ (5), షకిబ్ అల్ హసన్ 9(నాటౌట్) మరో వికెట్ కోల్పోకుండానే కోల్‌కతాను గెలిపించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరులో కెప్టెన్ కోహ్లి (39) మాత్రమే రాణించాడు. నరైన్ 21 పరుగులకే నాలుగు వికెట్లు తీసి బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News