న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు, క్రియాశీల కేసులు సంఖ్య ఊరట కలిగిస్తోంది. కొత్త కేసులు మార్చి ప్రారంభం నాటి స్థాయికి తగ్గగా, క్రియాశీల కేసులు 209 రోజుల కనిష్ఠానికి పడిపోయాయి. ఇక రికవరీ రేటు 98 శాతానికి పెరిగింది. సోమవారం కేంద్రం విడుదల చేసిన ఈ గణాంకాలు సానుకూలంగా కనిపించాయి. అయితే ప్రస్తుతం పండగల సీజన్ నడుస్తుండడంతో మహమ్మారి విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం, నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,81,766 మందికి కొవిడ్ నిర్దారణ పరీక్షలు చేయగా, 14,313 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. అలాగే నిన్న ఒక్కరోజే 26,579 మంది కోలుకున్నారు.
దాంతో మొత్తం కేసులు 3.39 కోట్లకు చేరగా, రికవరీ రేటు 3.32 కోట్లు (98 శాతం)గా ఉన్నాయి. మరోపక్క మరణాలు కూడా 200 దిగువన నమోదయ్యాయి. గత 24 గంటల్లో 181 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 4,50,963 కి చేరింది. మొత్తం పంపిణీ అయిన డోసుల సంఖ్య 95 కోట్ల మార్కును దాటింది. దసరా లోగా 100 కోట్ల మార్కును చేరుకోవాలని లక్షంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
14313 New Corona Cases Reported in India