Friday, November 22, 2024

విద్యుత్‌ను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

- Advertisement -
- Advertisement -
Strict measures if electricity is sold at high prices
కేంద్రం వద్ద ఉన్న విద్యుత్‌ను వాడుకోండి
కరెంట్ కోతలు విధించొద్దు
రాష్ట్రాలకు కేంద్రం సూచనలు

న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తుందన్న భయాందోళనల నడుమ పలు రాష్ట్రాలు విద్యుత్ కోతలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్నిప్రాంతాల్లో లోడ్ సర్దుబాటు కోసం విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో అప్రమత్తమైన కేంద్రప్రభుత్వం మంగళవారం రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేసింది. ప్రజల అవసరాల కోసం కేంద్రం వద్ద ఉన్న కేటాయించని విద్యుత్‌ను వాడుకోవాలని సూచించింది. అలాగే మిగులు విద్యుత్ ఉన్నరాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు ‘ కరెంటు సాయం’ చేయాలని కోరింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ బొగ్గు కొరత ఆందోళనల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు తమ వినియోగదారులకు కరెంటు సరఫరా చేయకుండా లోడ్ సర్దుబాటుకోసం కోతలు విధిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇదే సమయంలో వారు అధిక ధరలకు విద్యుత్‌ను విక్రయిస్తున్నట్లు కూడా తెలిసింది. వినియోగదారులకు విద్యుత్‌ను సరఫరా చేసే బాధ్యత డిస్ట్రిబ్యూషన్ కంపెనీలదే.

ముందు వారు తమ వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేయాలి. 24×7 విద్యుత్‌ను అందించాలి. తమ సొంత వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేయకుండా విద్యుత్‌ను విక్రయించకూడదు’ అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వినియోగదారులకు సరఫరా చేయకుండా అధిక ధరలకు కరెంట్‌ను విక్రయించే రాష్ట్రాలపై కఠినచర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా హెచ్చరించింది. అలా చేసే రాష్ట్రాలకు కేటాయించని విద్యుత్‌ను ఉపయోగించుకునే వెసులుబాటును ఉపసంహరించి దాన్ని ఇతర రాష్ట్రాలకు కేటాయిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ‘ విద్యుత్ కేటాయింపు మార్గదర్శకాల ప్రకారం సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల వద్ద 15 శాతం విద్యుత్‌ను ఏ రాష్ట్రానికి కేటాయించకుండా ఉంచడం జరుగుతుంది.

అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ అవసరమున్న రాష్ట్రాలకు కేంద్రం దీన్ని కేటాయిస్తుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్టా ఆ ‘కేటాయించని విద్యుత్’ను రాష్ట్రాలు ఉపయోగించుకొని తమ ప్రజలకు సరఫరా చేయాలని కోరుతున్నాం. ఒక వేళ మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. దానివల్ల మిగులు విద్యుత్‌ను కరెంటు అవసరమున్న రాష్ట్రాలకు కేటాయించడానికి వీలవుతుంది’ అని కేంద్రం ప్రకటించింది. ఎక్స్‌చేంజిలలో విద్యుత్ ధరలు ఎక్కువగా ఉండడంపట్ల పలు రాష్ట్రాలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ హెచ్చరికలు చేసింది. అధిక ధరల కారణంగా గత కొన్ని రోజులుగా ఇండియన్ ఎక్స్‌చేంజ్ లిమిటెడ్ షేర్లు రికార్డు స్థాయిలో పెరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News