శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్ వరస ఎన్‌కౌంటర్లతో అట్టుడికి పోతోంది. తాజాగా మంగళవారం షోపియాన్ జిల్లాలోని రెండు వేర్వేరు చోట్ల భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు. ఇందులో తుల్రాన్ ప్రాంతంలో జరిపిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టిఆర్‌ఎఫ్)కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమైనారు. వీరిలో ఒకరిని ముఖ్తార్ షాగా గుర్తించినట్లు కశ్మీర్ ఐజిపి విజయ్ కుమార్ చెప్పారు. ఇటీవల శ్రీనగర్‌లో బిహార్ వాసి హత్య కేసులో ఇతను నిందితుడని చెప్పారు. ఈ క్రమంలో వారివద్దనుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
మరో వైపు ఫీరీ పోరా లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంనుంచి రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్ల్లు , వారిని ఉబైద్ అహ్మద్ దార్, ఖుబైబ్ అహ్మద్ దార్‌లుగా గుర్తించినట్లు, వీరికి లష్కరె తోయిబాతో సంబంధాలున్నట్లు, పలు ఉగ్రనేరాలతోను సంబంధాలున్నట్లు పోలీసు అధికార ప్రతినిధి చెప్పారు. ఈ ఉగ్రవాదులను అంతమొందించడంతో శ్రీనగర్, బందీపోరాలో ఇటీవల జరిగిన నాలుగు హత్యల కేసులు పరిష్కారమయ్యాయని ఆ ప్రతినిధి తెలిపారు. కవ్మీర్ లోయలో ఇటీవల జరిగిన వరస ఉగ్రదాడుల్లో ఇద్దరు టీచర్లు సహా పలువురు పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఉగ్రవాద కార్యకలాపాల కట్టడికి భద్రతా దళాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో కశ్మీర్ వ్యాప్తంగా దాదాపు 700 మంది ఉగ్రవాద సానుభూతి పరులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.