హైదరాబాద్: పాలమూరు బతుకుల గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ కు సిగ్గుండాలని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు తీవ్ర అన్యాయం జరిగిందని శ్రీ కృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు. 2014 కు ముందు పాలమూరులో లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదు, 87 వేల ఎకరాలకు పారాల్సిన ఆర్డీఎస్ నీటిని క్రమక్రమంగా 20 వేల ఎకరాలకు కుదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూరాల నిర్మాణం 36 ఏళ్లు సాగదీశారని, కర్ణాటకకు రూ.70 కోట్లు పరిహారం ఇచ్చిన జూరాలను నిండుగా నింపలేదన్నారు.
ఉద్యమంలో నిలదీస్తే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పరిహారం చెల్లించారని, పాలమూరుకు కాంగ్రెస్ ఏం చేసిందో ప్రస్తుత పిపి అధ్యక్షుడు టిడిపి ఉన్నప్పుడు వందల సార్లు చెప్పారన్నారు. పాలమూరు కొత్తగా నీళ్లొచ్చిన ఏ ఊరిలో ఎవరిని అడిగినా సాగు నీళ్లు ఎవరు తెచ్చారో వారే చెబుతారన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద 2014 నాటికి నీళ్లు వచ్చింది లిఫ్ట్ వన్ కింద 13 వేల ఎకరాలకు మాత్రమేనని, లిఫ్ట్ 2, లిఫ్ట్ 3 లను 2014 తర్వాత టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటబడి పూర్తి చేశామన్నారు. 2014 నుండి దాదాపు 70 సార్లకు పైగా నేను స్వయంగా పర్యటించి పనుల పూర్తికోసం అధికారుల వెంటపడ్డానని, ప్రాజెక్టుల వద్ద నిద్రలు చేశామన్నారు. పాలమూరు ఎత్తిపోతల మీద కేసులు వేసి అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు పనులు కాలేదని దుయ్యబట్టారు. ఆంధ్రలో జగన్ – చంద్రబాబుల మధ్య ఎంత విరోధం ఉన్నా ప్రాజెక్టులను అడ్డుకోలేదని, కేసులు వేయలేదన్నారు.
తెలంగాణ ప్రాంత విపక్ష నేతలకు ఎన్ని సార్లు చెప్పినా కేసులు వేయడం వారి అక్కసుకు నిదర్శనమని నిరంజన్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసమే శ్రీకాంతచారి ఆత్మార్పణం చేశారని, శ్రీకాంతచారి ఫోటోలను వాడుకోవడం, ఆయన విగ్రహానికి కాంగ్రెస్ దండ వేయాలనుకోవడం దౌర్భాగ్యమైన విషయమని ఘాటు విమర్శించారు. కెసిఆర్ అధికారంలో ఉన్నది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనని, దేశంలోని మిగతా రాష్ట్రాలలో కాంగ్రెస్, బిజెపిలే ఉన్నాయని, ఒక్క రాష్ట్రంలోనయినా కెసిఆర్ మాదిరిగా పథకాలు, పాలన అమలు చేసి చూపండని బిజెపి పాలిత రాష్ట్రాలకు సవాలు విసిరారు. ఉద్యోగాల గురించి, తెలంగాణ ప్రాజెక్టుల గురించి కాంగ్రెస్ మాట్లాడడం గువ్వొచ్చి గుడ్లు పెట్టినట్లుందని చురకలంటించారు. మరుగున పడిన తెలంగాణ నినాదాన్ని ఎత్తుకుని ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత పార్లమెంటును ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కెసిఆర్ అని ప్రశంసించారు.
దేశంలోని ఏ రాష్ట్రం అయినా ఏ అంశంలో అయినా పోటీ పడగలదేమో చర్చకు సిద్దమా ? అని సవాలు విసిరారు. వైఎస్ మెప్పు కోసం పోతిరెడ్డిపాడు నీళ్లకు అనుకూలంగా వ్యాసాలు రాసినోళ్లు పాలమూరుకు నీళ్లు తెచ్చామనడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పెద్దదన్నారు. అరుపులు, కేకలతో అధికారం దక్కుతుందని అనుకోవడం అవివేకమని, తెలంగాణ ఎల్లలు తెల్వనోళ్లు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని నిరంజన్ రెడ్డి చురకలంటించారు. తెలంగాణ జలవనరుల మీద కేంద్రం పెత్తనానికి సిద్దమవుతుందని, ఈ అంశం మీద కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ ఎందుకు మాట్లాడరు ? మీరు పార్లమెంటులో ఎందుకు లేవనెత్తరు ? కెసిఆర్ ను తిట్టడమే మీ ఎజెండానా? జాతీయ పార్టీ దిక్కుమాలిన విధానానికి ఇది నిదర్శనమని మండిపడ్డారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాను ఐదు జిల్లాలుగా విభజించి పాలమూరును వికేంద్రీకరించామని, 60 ఏండ్లలో పాలమూరుకు ఒక్క ఇంజనీరింగ్ కళాశాల ఇవ్వ చేతకాలేదని దుయ్యబట్టారు. టిఆర్ఎస్ పాలనలో రెండు మెడికల్, ఒక మత్స్య కళాశాలల ఏర్పాటు చేశామని, ఉమ్మడి రాష్ట్రంలో పేరుకు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశామని, తెలంగాణ వర్శిటీకి నిధుల కోసం కొట్లాడితే రూ.3 కోట్లు ఇచ్చారని, కడప యోగి వేమన యూనివర్శిటీకి రూ.300 కోట్లు ఇచ్చారని దుయ్యబట్టారు. కెసిఆర్ ఎంపిగా ఉన్నప్పుడు పాలమూరు యూనివర్శిటీలో మహిళలకు వసతుల కోసం రోశయ్యతో కొట్లాడితే రూ.9 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ పోతుంటే విద్యార్థులను రెచ్చగొట్టడమే పనిగా కొందరు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.