బెంగళూరు: కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కెపిసిసి) అధక్షుడు డికె శివకుమార్‌కు వ్యతిరేకంగా కెమెరా ముందు తీవ్ర అవినీతి ఆరోపణలు దొరికిపోయిన మీడియా కోఆర్డినేటర్ సలీమ్, మాజీ ఎంపీ విఎస్ ఉగ్రప్పను పార్టీ సస్పెండ్ చేసింది.
ఆ ఇద్దరు నాయకులు మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. అయితే ప్రసంగించడానికి ముందు వారు వేదిక మీద ప్రైవేట్ సంభాషణ కొనసాగించారు. అప్పుడు మైక్రోఫోన్లు, కెమెరాలు ఆన్‌లో ఉన్నాయి. ఉగ్రప్ప చెవిలో సలీమ్ గుసగుసలాడిన వీడియో వైరల్ అయింది. అందులో శివకుమార్‌ను ఉద్దేశించి ‘కలెక్షన్ గిరాకీ’(ఏజెంట్) అని, కమీషన్లతో కోట్లాది రూపాయలు వెనకేసుకున్నాడని ఆరోపించడం రికార్డయింది.
కాంగ్రెస్-జెడి(ఎస్) సంకీర్ణ ప్రభుత్వంలో శివకుమార్ నీటి వనరుల శాఖ మంత్రిగా ఉండేవారు. సలీమ్ శివకుమార్ మాట్లాడే తీరుపై కూడా వ్యాఖ్యానించాడని తెలుస్తోంది. కాగా శివకుమార్ నాయకత్వంలో పార్టీ తిరిగి అధికారంలోకి రాలేకపోయిందని ఉగ్రప్ప అనడం కూడా వీడియోలో రికార్డయింది. ఇదిలావుండగా కెపిసిసి క్రమశిక్షణ కమిటీ సలీమ్‌ను పార్టీ నుంచి ఆరు ఏళ్లు సస్పెండ్ చేసింది. ఇంకా ఉగ్రప్ప నుంచి జవాబు కోరింది, షోకాజ్ నోటీసు ఇచ్చింది.
శివకుమార్ బుధవారం ప్రతిస్పందిస్తూ కాంగ్రెస్ చాలా క్రమశిక్షణగల పార్టీ. ‘ఇది పార్టీకి ఇబ్బందికర విషయం. వారు చేసిన ప్రకటనలు పార్టీకి గానీ, నాకు గానీ సంబంధించినవి కావు. అది వారిద్దరూ లోలోపల మాట్లాడుకున్న విషయం. నేను వాటిని కాదనలేను’ అని చెప్పుకొచ్చారు.
హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర మాట్లాడుతూ ‘ఒకవేళ ఉగ్రప్ప అవినీతి రహిత సమాజం కోసం అంతగా తపించిపోతున్నట్లయితే, ఫిర్యాదును దాఖలుచేయాలి, రాష్ట్రపోలీసులు ఆ ఆరోపణలపై దర్యాప్తు చేస్తారు’ అన్నారు. ఇదిలావుండగా కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య ఇప్పటికీ విభేదాలున్నాయి. వైరల్ అయిన వీడియో కూడా పార్టీలో గ్రూపిజం ఉందనడానికి చక్కని ఉదాహరణ. ఇతర పార్టీలకు చెందిన నాయకులు దీనిని అవకాశంగా తీసుకుని కాంగ్రెస్ అవినీతి పార్టీ అంటూ ట్వీట్లు చేశారు.