రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ బృందం
న్యూఢిల్లీ : లఖింపూర్ ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా వెంటనే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను రాహుల్ గాంధీ నాయకత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం కలిసింది. ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటనలో కేంద్ర మంత్రి కుమారుడు నిందితుడుగా ఉన్నారు. కేంద్రంలో ఆయన తండ్రి మంత్రిగా ఉన్నారు. ఈ దశలో జరిగే దర్యాప్తుపై ప్రభావం పడుతుంది. వెంటనే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మంత్రిని పదవి నుంచి బర్తరఫ్ చేయాల్సి ఉందని కాంగ్రెస్ తెలిపింది. తాము ఈ డిమాండ్‌తోనే రాష్ట్రపతిని కలిసినట్లు, ఆయన దీనిపై ప్రభుత్వంతో మాట్లాడుతానని చెప్పినట్లు ఆ తరువాత విలేకరులకు కాంగ్రెస్ బృందం తెలిపింది.
కేంద్ర మంత్రిగా మిశ్రా ఉన్నంత కాలం ఘటనకు సంబంధించి తమకు న్యాయం జరగదని రైతుల కుటుంబాలు తెలియచేస్తున్నాయని , ఇదే విషయాన్ని స్థానికులు ఇతర సంఘాలవారు స్పష్టం చేస్తున్నారని ప్రియాంక గాంధీ విలేకరులతో భేటీ దశలో తెలిపారు. ఒక్కరోజు క్రితం రైతుల ఆత్మశాంతికి యుపిలో జరిగిన ప్రార్థనలలో పాల్గొన్న తరువాత ప్రియాంక గాంధీ ఇక్కడికి వచ్చారు. యుపి రాష్ట్ర స్థాయి దర్యాప్తుతో న్యాయం జరిగేది లేదని, కేవలం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో జరిగే దర్యాప్తు క్రమంలోనే నిజాలు వెలుగులోకి వస్తాయని ఈ విషయాన్ని రాష్ట్రపతికి తెలియచేశామని రాహుల్ గాంధీ వివరించారు. రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ బృందంలో ఆజాద్, ఖర్గే, వేణుగోపాల్ , ఆంటోనీ అధీర్ రంజన్ ఇతరులు ఉన్నారు.