వరుణ్, హార్దిక్ స్థానాలు పదిలం, ప్రపంచకప్ కోసం టీమిండియా ఎంపిక
ముంబై: ట్వంటీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే టీమిండియాలో యువ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ చోటు దక్కించుకున్నాడు. అక్షర్ పటేల్ స్థానంలో శార్దూల్ జట్టులోకి వచ్చాడు. ఇక ఫిట్‌నెస్ లేమీతో బాధపడుతున్న ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్య, వరుణ్ చక్రవర్తిలు తమ స్థానాలను కాపాడుకున్నారు. యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు టీమిండియాలో స్థానం దక్కలేదు. అయితే అతనితో పాటు అక్షర్ పటేల్, దీపక్ చాహర్‌లు స్టాండ్‌బైలుగా ఎంపికయ్యారు.
ఊహించినట్టే..
ఇక ఐపిఎల్‌లో అద్భుతంగా రాణించి చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె)ను ఫైనల్‌కు చేర్చడంలో తనవంతు పాత్ర పోషించిన యువ స్పీడ్‌స్టర్ శార్దూల్ ఠాకూర్‌కు ఊహించినట్టే వరల్డ్‌కప్ జట్టులో చోటు లభించింది. ఐపిఎల్‌లో శార్దూల్ అద్భుత ప్రతిభను కనబరిచాడు. పలు మ్యాచుల్లో చెన్నైకి అండగా నిలిచాడు. అసాధారణ బౌలింగ్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతని ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుని భారత క్రికెట్ బోర్డు టీమిండియాకు ఎంపిక చేసింది. బ్యాట్‌తో బంతితో మెరుపులు మెరిపించే సత్తా శార్దూల్‌కు ఉంది. కొంతకాలంగా శార్దూల్ నిలకడైన ప్రదర్శన చేస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టాడు. బంతితోనే కాకుండా బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపించాడు. అతని ప్రతిభను చూసి వరల్డ్‌కప్ జట్టులో చోటు ఖాయమని అందరూ భావించారు. అయితే తొలుత ప్రకటించిన టి20 జట్టులో శార్దూల్‌కు స్థానం దక్కలేదు. అతన్ని స్టాండ్‌బైగా మాత్రమే ఎంపిక చేశారు. కానీ సీనియర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అంతంత మాత్రం ప్రదర్శన చేస్తుండడంతో ముందు జాగ్రత్తగా శార్దూల్‌ను కూడా జట్టులోకి తీసుకున్నారు. ఐపిఎల్ సందర్భంగా గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో శార్దూల్‌కు జట్టులో చోటు కల్పించారు. ఇప్పటికే టీమిండియాలో అశ్విన్, జడేజా, రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తి వంటి అగ్రశ్రేణి స్పిన్నర్లు ఉన్నారు. ఇలాంటి స్థితిలో అక్షర్ కంటే ఠాకూర్‌ను ఎంపిక చేయడమే మంచిదని భావించి అతనికి స్థానం కల్పించారు.
పూర్తి ఫిట్‌నెస్‌తో లేకున్నా..
మరోవైపు హార్దిక్ పాండ్య, వరుణ్ చక్రవర్తి తదితరులు పూర్తి ఫిట్‌నెస్‌తో లేకున్నా వరల్డ్‌కప్ జట్టులో స్థానాన్ని కాపాడు కోవడంలో సఫలమయ్యారు. జట్టు యాజమాన్యం వీరిపై నమ్మకాన్ని ఉంచింది. ఐపిఎల్‌లో హార్దిక్ పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచాడు. బ్యాటింగ్‌కే పరిమితమైన హార్దిక్ ఒక్క మ్యాచ్‌లో కూడా తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోయాడు. అంతేగాక హార్దిక్ పూర్తి ఫిట్‌నెస్‌తో లేడనే విషయం బిసిసిఐకి కూడా తెలుసు. అయినా అతనిపై నమ్మకాన్ని ఉంచి వరల్డ్‌కప్ జట్టులో చోటు కల్పించింది. ఇక రాహుల్ చాహర్ ఫామ్ లేమీతో బాధపడుతున్నాడు. ఐపిఎల్‌లో ముంబైకి ప్రాతినిథ్యం వహించిన రాహుల్ ఈ సీజన్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. వికెట్లను తీయడంలో తేలిపోయిన రాహుల్‌కు వరల్డ్‌కప్ జట్టు నుంచి ఉద్వాసన ఖాయమని అందరూ భావించారు. కానీ సెలెక్టర్లు మాత్రం అతనిపై నమ్మకం ఉంచారు. ఇక అంతంత మాత్రం ఫిట్‌నెస్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వరుణ్ చక్రవర్తి కూడా అనూహ్యంగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. పెయిన్ కిల్లర్‌లు వాడి ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడుతున్న వరుణ్‌ను వరల్డ్‌కప్‌కు దూరంగా ఉంచుతారని జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.
బిసిసిఐ కూడా ఒక దశలో అతన్ని తప్పిస్తున్నట్టు సంకేతాలు ఇచ్చింది. కానీ బుధవారం వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన జట్టులో వరుణ్ చక్రవర్తి స్థానాన్ని నిలబెట్టు కోవడం విశేషం. ఇక ఐపిఎల్‌లో పేలవమైనఆటతో నిరాశ పరిచిన ముంబై క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లు కూడా వరల్డ్‌కప్‌లో తమ స్థానాన్ని కాపాడు కోవడంలో సఫలమయ్యారు. చివరి దశ మ్యాచుల్లో మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచడంతో వీరి స్థానాలకు ఢోకా లేకుండా పోయింది. కాగా, అక్టోబర్ 17 నుంచి టి20 ప్రపంచకప్ ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఒమాన్‌లో నిర్వహిస్తున్నారు. ఇక ఇతర మ్యాచ్‌లకు యుఎఇ వేదికగా నిలువనుంది.
నెట్ బౌలర్లుగా హర్షల్, అవేశ్
కాగా, యువ క్రికెటర్లు హర్షల్ పటేల్, ఉమ్రాన్ అక్మల్, అవేశ్ ఖాన్, వెంకటేశ్ అయ్యర్ తదితరులు ప్రపంచకప్‌లో పాల్గొనే టీమిండియాకు నెట్ బౌలర్లుగా సేవలు అందిస్తారు. అంతేగాక కర్ణ్ శర్మ, షాబాజ్ అహ్మద్, లక్మన్ మెరివాలా, కృష్ణప్ప గౌతమ్‌లకు ఈ జాబితాలో చోటు కల్పించారు. వీరందరికి బయోబబుల్‌లో ఉండాలని బిసిసిఐ ఆదేశాలు జారీ చేసింది. ఐపిఎల్ కోసం ఈ ఆటగాళ్లందరూ యుఎఇలోనే ఉన్న విషయం తెలిసిందే.
వరల్డ్‌కప్‌కు ఎంపికైన జట్టు వివరాలు
విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కెఎల్.రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి, రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తి.
స్టాండ్‌బై ఆటగాళ్లు: శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్.