తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రారంభం, పార్టీ ప్లీనరీ, విజయగర్జన సభ, పార్టీ అంతర్గత విషయాలపై ప్రధాన చర్చ
మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్ ఎల్‌పి సమావేశం ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్‌లో జరగనుంది. పార్టీ అధ్యక్షులు, సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో ఎంపిలు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు పాల్గొంటారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై కూలంకషంగా చర్చిస్తారు. ప్రధానంగా ఈ నెల 25వ తేదీన నగరంలోని హెచ్‌ఐసిసిలో తలపెట్టిన పార్టీ ప్లీనరీ, పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికతో పాటు నవంబర్ 15వ తేదీన వరంగల్‌లో తలపెట్టిన విజయ గర్జన సభ ఏర్పాట్లపై పార్టీ ప్రతినిధులతో సిఎం కెసిఆర్ చర్చించనున్నారు. వీటితో పాటు పార్టీ అంతర్గత విషయాలు, సంస్థాగత కమిటీలపై కూడా సమగ్రంగా చర్చించే అవకాశముందని తెలుస్తోంది. ముఖ్యంగా ప్లీనరీ, విజయ గర్జన సభను విజయవంతం చేయడం కోసం వారి నుంచి తగు సూచనలు, సలహాలు కూడా తీసుకునే అవకాశముందని అధికార పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అదే విధంగా శాసనసభ్యులు, ఎంపిల పనితీరుపై సిఎం కెసిఆర్ ఇప్పటికే పలు అంతర్గత నివేదికలు తెప్పించుకున్నారని తెలుస్తోంది.
ఈ అంశంపై కూడా చర్చించే అవకాశందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఎంపిలు, ఎంఎల్‌ఎలు ఎంత మంది ఉన్నారు? ఎంతమంది ప్రజాప్రతినిధులు ప్రజలకు చేరువకాలేకపోతున్నారన్న జాబితాలో ఉన్న నేతల గుట్టువిప్పనున్నారు. ప్రజల అభిమానాన్ని పొందలేకపోతున్న నియోజకవర్గాల శాసనసభ్యులకు సిఎం కెసిఆర్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసే అవకాశ ముందని తెలుస్తోంది. ప్రధానంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కేవలం ఏడు సంవత్సరాల్లోనే అనేక వినూత్నమైన కార్యక్రమాలతో దేశంలో అగ్రస్థాయిలో తెలంగాణ దూసుపోతున్నది. దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమలను చేపట్టినప్పటికీ కొందరు ప్రజాప్రతినిధులు వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంలో వెనుకపడిపోతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాంటి నేతలకు సిఎం కెసిఆర్ పరోక్షంగా క్లాస్‌పీకే అవకాశాలు ఉద్నయని కూడా తెలుస్తోంది. ఇక కొన్ని నియోజకవర్గాల్లో ఎంఎల్‌ఎలు, ఎంపిల మధ్య నెలకొన్న అంతర్గత విబేధాలు, సమన్వయ లోపం తదితర అంశాలపైకూడా సిఎం కెసిఆర్ ఆరా తీయనున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాల బోగట్ట. మొత్తానికి నేడు జరిగే సమావేశంపై ఎంపిలు, ఎంఎల్‌ఎల్లో టెన్షన్ నెలకొంది.
నేడు ఎన్నికల షెడ్యూల్ విడుదల…అధ్యక్ష పదవికి దరఖాస్తుల స్వీకరణ
టిఆర్‌ఎస్ అధ్యక్ష పదవికి కోసం నేడు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఆదివారం ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మాజీ ఎంఎల్‌సి శ్రీనివాస్‌రెడ్డి ఈ షెడ్యూల్‌ను విడుదల చేస్తారు. అనంతరం అధ్యక్ష పదవి కోసం దరఖాస్తులను స్వీకరణ కార్యక్రమం కూడా మొదలతుంది. ఈ నెల 22వ తేదీ వరకు అధ్యక్ష పదవి కోసం దరఖాస్తులను స్వీకరిస్తారు.