దళిత వర్గాలకు దళిత బందు పథకం అనేది ఒక ఆశాజ్యోతి
ఇలాంటి పథకం తెలంగాణలో తప్ప మరెక్కడా లేదు
కెసిఆర్‌లా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న సత్తా దేశంలో మరేనాయకుడికి లేదు
అందుకే తాను టిఆర్‌ఎల్‌లో చేరాలని నిర్ణంచుకోవాల్సి వచ్చింది
మన తెలంగాణ ప్రతినిధితో మాజీ మోత్కుపల్లి నర్సింహులు
మన తెలంగాణ/హైదరాబాద్ : కులం అనే నీచమైన సంస్కృతిని కూకటివేళ్లతో పెకిలించే సత్తా భారత దేశంలో ఒక్క ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకే ఉందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఇది ఆయన ఒక్కరి వల్లే సాధ్యమవుతుందన్నారు. ఇందులో భాగంగానే సిఎం కెసిఆర్ దళిత బంధు అనే విప్లవాత్మకమైన పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. దళితబంధు అనేది కులవ్యవస్థను పూర్తిగా సమాజం నుంచి పారదోలోందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ పథకం కింద ఒక్కొక్క దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదన్నారు. అలాంటి ఆలోచన కెసిఆర్‌కు తప్ప దేశంలో మరెవరికి రాలేదన్నారు. ఆయనలా అందరూ ఆలోచించి ఉంటే దేశంలో కుల వ్యవస్థ అన్నది ఇప్పటికే ఉండకపోయేదన్నారు. దళిత కుటుంబాలను ఓట్లు వేసే యంత్రాలుగా చూశారే తప్ప….ఏనాడు వారి అభ్యున్నతికి పాటుపడిన పాలకులు లేరన్నారు. అలాంటి అభినవ అంబేడ్కర్ వంటి కెసిఆర్ నాయకత్వంలో తాను పనిచేయాలన్న ఆలోచనతోనే టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకోవాల్సి వచ్చిందన్నారు.
ఆదివారం మన తెలంగాణ ప్రతినిధితో మోత్కుపల్లి నర్సింహులు కొద్దిసేపు ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కులం పునాదుల మీద జాతి నిర్మాణం సాధ్యపడదని స్వయంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేదర్క్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దీనిని తు,చ తప్పకుండా సిఎం కెసిఆర్ ఆలోచిస్తున్నారన్నారు. కాబట్టే రైతులకు రైతు బంధు, 24 గంటల పాటు ఉచిత కరెంటు ఇవ్వడం వంటి నిర్ణయాలు సిఎం కెసిఆర్ తీసుకున్నారన్నారు. దళితులు, పేదవర్గాలు అంతా ఏకమై కెసిఆర్‌కు అండగా ఉండాలన్నదే తన ప్రస్తుత నినాదమన్నారు. అంతే తప్ప తానేదో పదవులకు ఆశపడి టిఆర్‌ఎస్‌లో చేరడం లేదని ఆయన స్పష్టం చేశారు. భారత దేశంలో ఏ నాయకుడు తీసుకోని విధంగా…పలు సాహసోపేత నిర్ణయాలు సిఎం కెసిఆర్ తీసుకుంటున్నారన్నారు. ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేవలం ఏడేళ్లలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టడం అంత సులవైన విషయం కాదన్నారు. అసాధ్యం అనుకున్న అనేక రంగాలను అభివృద్ధిలో పరుగులు తీయించారన్నారు. అందుకుఏ పలు అంశాల్లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సిఎం కెసిఆర్ సాగిస్తున్న జనరంజకమైన పాలన చూసే తాను కూడా గులాబీ పార్టీ వైపు అడుగులు వేయాల్సి వచ్చిందన్నారు.
దళితబంధు తనను అమితంగా ఆకర్శించింది
దళితుల అభ్యున్నతి కోసం సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం తనను అమితంగా ఆకర్శించిందని మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. ఇది ప్రవేశపెట్టినప్పటి నుంచే సిఎం కెసిఆర్ పట్ల తనకు ఎనలేని అభిమానం కలిగిందన్నారు. అందుకే తాను టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకోవాల్సి వచ్చిందన్నారు. అంతే తప్ప పదవుల కోసమే…ఏ ఇతర లాలూచీ కోసం తాను టిఆర్‌ఎస్‌లో చేరడం లేదన్నారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేయాలన్నదే తన అభిమతమన్నారు.
తన నాలుగు దశబ్ధాల రాజకీయ జీవితంలో ఏనాడు పదవుల కోసం పాకులాడలేదన్నారు. నిత్యం ప్రజాసమస్యలపై స్పందించడమే తనకు తెలుసన్నారు. ఇందులో తన, పర అన్న తేడా లేకుండా వ్యవహరించానని అన్నారు. తాను నమ్మిన సిద్దాంతాలు, విలువల కోసమే ఇప్పటి వరకు రాజకీయాల్లో నడుచుకున్నానని అన్నారు. అందుకే తాను గతంలో అధికర పక్షంలో ఉన్నప్పటికీ ప్రజలకు ఇబ్బంది కలిగే ఎలాంటి నిర్ణయంపైనా మౌనంగా ఉండలేదన్నారు. తనది మొదటి నుంచి ప్రశ్నించే తత్వమన్నారు.
బిజెపి… కులాలను పోషించే పార్టీ
భారత దేశంలో కులాలను పెంచి పోషించే పార్టీ ఏదైనా ఉందంటే అది ముమ్మాటికి బిజెపియేనని మోత్కుపల్లి అన్నారు. అందుకే ఆ పార్టీలో తాను ఎక్కువ రోజులు ఉండలేకపోయాయనిఆయన వివరించారు. ముఖ్యంగా పేదవర్గాలకు ఏ మాత్రం ఉపయోగపడే పార్టీ కాదన్నారు. కులాలు అనే విష సంస్కృతితో రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ పార్టీ పనిచేస్తోందని విమర్శించారు. ఇది తాను చెప్పడం లేదని…గతంలోనే అంబేద్కర్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మోత్కుపల్లి గుర్తు చేశారు. ఇతర పార్టీల నుంచి బిజెపిలోకి వచ్చిన వారు ఎవరు సంతోషంగా లేరన్నారు. వారు కూడా ఎంతో కాలం ఆ పార్టీలో ఇమడలేరన్నారు. తన మాదిరిగానే ఎప్పుడో ఒక రోజు వారంతా బిజెపిని వీడాల్సిందేనని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు.