భారత్‌కు శ్రీలంక మొర
కొలంబో : దిగువన ఉన్న పొరుగుదేశం శ్రీలంక భారతదేశపు సాయాన్ని అభ్యర్థించింది. ముడి చమురు కొనుగోళ్ల బకాయిలను తీర్చేందుకు తమకు తక్షణ సాయంగా 50 కోట్ల డాలర్ల రుణసాయం అందించాలని కోరింది. పలు కారణాలతో శ్రీలంక ఇప్పుడు తీవ్రస్థాయి విదేశీ మారకద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో చమురు ఇంధన నిల్వలు అడుగంటిపోతున్నాయి. విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతులతో వ్యవహారం సాగిస్తున్నారు. అయితే ఈ దశలో ముడిచమురు కొనుగోళ్ల సంబంధిత బకాయిలు పేరుకుపొయ్యాయి. వీటిని తీర్చేందుకు భారతదేశం ఆదుకోవాలని శ్రీలంక వేడుకుంది. ఇటీవలే లంక ఇంధన మంత్రి ఉదయ గమ్మన్‌పిల్ల ఓ ప్రకటన వెలువరించారు. దేశంలో ఇప్పుడున్న ఇంధనం దేశ అవసరాలకు జనవరి వరకూ సరిపోతుందని కటకట పరిస్థితిని తెలిపారు. భారత్ శ్రీలంక ఆర్థిక భాగస్వామ్య సహకార ఒప్పందం పరిధిలో భాగంగా భారతదేశ సాయం కోసం స్థానిక భారత హై కమిషనర్ వర్గాల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ప్రభుత్వానికి చెందిన సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (సిపిసి) తెలిపింది.