Saturday, November 23, 2024

తొలి మ్యాచ్‌లో ఒమన్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

Oman win by 10 wickets over Papua New Guinea

అజేయ అర్ధ సెంచరీలతో మెరిసిన ఓపెనర్లు ఇలియాస్. జతేందర్ సింగ్
పపువా న్యూగినియాపై 10 వికెట్ల తేడాతో గెలుపు

అల్ అమెరట్(ఒమన్) : టి20 ప్రపంచ కప్ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఒమన్ జట్టు క్రికెట్ పసి కూన, ఈ మెగా ఈవెంట్‌కు తొలిసారి అర్హత సాధించిన పపువా న్యూగినియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ అకిబ్ ఇలియాస్(50),జతేందర్ సింగ్ ( 73) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరానికి చేర్చారు. పపువా న్యూగినియా నిర్దేశించిన 130 పరుగుల లక్షాన్ని 13.4 ఓవర్లలోనే ఛేదించారు. ముఖ్యంగా భారత్‌లోని జలంధర్‌లో జన్మించిన జతేందర్ సింగ్ పపువా న్యూగినియా బౌలర్లపై విరుచుకు పడి ఫోర్లు, సిక్స్‌లు ఎడాపెడా బాదేశాడు. కేవలం 42 బంతుల్లోనే 73 పరుగులు చేయగా, మరో ఓపెనర్ అకిబ్ కూడా 43 బంతుల్లో నే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పపువా న్యూగినియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు టోనీ ఉరా, లెగా సియాకా పరుగుల ఖాతా తెరవకముందే పెవిలియన్ చేరారు.

ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా కెప్టెన్ అసద్‌వాలా, మరో బ్యాట్స్‌మన్ చార్లెస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ప్రపంచ వేదికపై తొలిసారి ఆడే అవకాశం దక్కించుకున్న జట్టు కెప్టెన్ అసద్ అర్ధ సెంచరీ (56 పరుగులు)తో రాణించాడు. పపువా న్యూగినియా ఇన్నింగ్స్‌లో అతడే టాప్ స్కోరర్. అయితే ఆ తర్వాత జుట్టులో మరెవరూ ప్రత్యర్థి జట్టు కెప్టెన్ జీషన్ మక్సూద్ ధాటికి తాళలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేవలం 20 పరుగులకే ననాలుగు వికెట్లు పడగొట్టిన మక్సూద్‌ను ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు వరించింది.

పపువా ఆటగాళ్ల భావోద్వేగం

కాగా ప్రపంచ వేదికపై ఆడాలన్న తమ కల ఇన్నాళ్లకు నెరవేరినందుకు పపువా న్యూగినియా క్రీడాకారులు భావోద్వేగంతో కన్నీటి పర్యంతం అయ్యారు. ఒమన్‌తో మ్యాచ్ ప్రారంభానికి ముందు తొలుత పపువా న్యూగినియా జాతీయ గీతాన్ని ప్లే చేశారు. ఆ సమయంలో ఆటగాళ్లు, ఇతర సిబ్బంది తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెటిజన్లను ఎంతో ఆకర్షిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News