మహిళలకు 33 శాతం రిజర్వేషన్
పర్మిట్లకు అప్లయ్ చేసుకునేందుకు ఆఖరు తేదీ నవంబర్ 1
న్యూఢిల్లీ: ఇ-ఆటో పర్మిట్లకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ఆరంభించింది. ఈ పర్మిట్లలో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ ఉంటుందని రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ తెలిపారు. తొలి విడతలో 140.6 మహిళా అభ్యర్థినులతోపాటు మొత్తం 4261 ఇ-ఆటోపర్మిట్లను మంజూరు చేయనున్నట్లు, అర్హులందరూ ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి తెలిపారు.
దేశ రాజధానిని ఎలక్ట్రిక్ వెహికిల్ క్యాపిటల్‌గా మార్చడానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకుంటున్న తొలి అడుగే ఇ-ఆటో పర్మిట్లు అని గెహ్లాట్ ట్వీట్ చేశారు. ఢిల్లీని కాలుష్యరహితంగా, ప్రపంచ స్థాయి రవాణా సేవలకనుగుణంగా రూపొందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలావుండగా ఢిల్లీ ప్రభుత్వం తన ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ కింద ఇ-ఆటోలు కొనుగోలు చేసేవారికి రూ. 30,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.