Saturday, November 23, 2024

యూపీ డిప్యూటీ స్పీకర్‌గా నితిన్ అగ్రావాల్ ఎన్నిక

- Advertisement -
- Advertisement -

Nitin Agarawal

లక్నో: సమాజ్‌వాదీ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎంఎల్‌ఎ నితిన్ అగ్రావాల్ ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా సోమవారం ఎన్నికయ్యారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బిజెపి బలపరిచింది. పోలయిన మొత్తం 364 ఓట్లలో నితిన్‌కు అనుకూలంగా 304 ఓట్లు రాగా, ఎస్‌పి బలపరిచిన అభ్యర్థి నరేంద్ర వర్మకు 60 ఓట్లు వచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీ తిరుగుబాటు ఎంఎల్‌ఎ అయిన నితిన్ అగ్రావాల్ 2019 నుంచే పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన ఇతర మంత్రులు వెంటరాగా నితిన్ అగ్రావాల్ తన నామినేషన్ పేపర్లు దాఖలు చేశారు.

సమాజ్‌వాదీ పార్టీ సీతాపూర్ శాసనసభ్యుడు నరేంద్ర వర్మను నిలబెట్టింది. ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రామ్‌గోవింద్ చౌదరి, ఇతర ఎస్‌పి శాసనసభ్యులు, బిఎస్‌పి తిరుగుబాటు నాయకుల సమక్షంలో తన నామినేషన్ పేపర్లు దాఖలు చేశారు.
2019లో ప్రతేక అసెంబ్లీ సమావేశంలో పార్టీ విప్‌ను ఉల్లంఘించినందుకుగాను నితిన్ అగ్రావాల్‌ను సభ నుంచి అనరుడిగా ప్రకటించాలని కోరుతూ సమాజ్‌వాదీ పార్టీ పెట్టుకున్న దరఖాస్తును అసెంబ్లీ స్పీకర్ ఇటీవల తిరస్కరించారన్నది ఇక్కడ గమనార్హం. ఇదిలా ఉండగా ఆయన అభ్యర్థిత్వం విషయంలో బిజెపి ‘పార్లమెంటరీ సంప్రదాయాలను మన్నించింది’ అని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ విమర్శలను ఖండించారు. “సాంకేతికంగా చూసినట్లయితే ఆయన ఇప్పటికీ సమాజ్‌వాదీ పార్టీ ఎంఎల్‌ఎనే” అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేశ్ ఖన్నా అభిప్రాయపడ్డారు.
ఇదిలావుండగా బిజెపి డిప్యూటీ స్పీకర్ ఎన్నికతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని వివిధ సమస్యల నుంచి దృష్టిని మళ్లిస్తోందంటూ కాంగ్రెస్ ఆ ఎన్నికను బహిష్కరించింది. అంతేకాక కాంగ్రెస్ కార్యకర్తలు అసెంబ్లీ బయట లఖీంపూర్ ఖేరిలో అక్టోబర్ 3న చనిపోయిన రైతులకు న్యాయం చేయాలంటూ బఠాయింపు జరిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News