నేరుగా తెలుపు కాంతిని వెదజల్లే నవకల్పన
న్యూఢిల్లీ: నేరుగా ధవళ(తెల్లని)కాంతిని వెదజల్లే లెడ్ పరికరాన్ని ఐఐటి మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇప్పటివరకూ ప్రపంచంలో అందుబాటులో ఉన్న లెడ్ లైట్లలో నేరుగా ధవళకాంతినిచ్చే పరికరాలు లేకపోవడం గమనార్హం. పరోక్ష సాంకేతికత(పలు రంగుల కాంతుల మిశ్రమం) ద్వారా ఇప్పటివరకూ ధవళకాంతినిచ్చే లెడ్‌లైట్లను తయారు చేస్తూవచ్చారు. దాంతో, ఐఐటి పరిశోధకులు రూపొందించిన ఈ పరికరాన్ని ఓ నవకల్పనగా భావించాలి. దేశీయంగా మన పరిశోధకులు రూపొందించిన ఈ పరికరాన్ని వాడకంలోకి తేవడం ద్వారా మనకు దిగుమతి ఖర్చులు ఆమేరకు తగ్గనున్నాయి. ఈ నూతన ఆవిష్కరణకు పరిశోధకులు ఇప్పటికే పేటెంట్ కూడా పొందారు.
సెర్బ్‌టెక్నాలజీ ట్రాన్స్‌లేషన్ అవార్డును కూడా వారికి ప్రదానం చేశారు. విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలకు సెర్బ్ నిధులు సమకూరుస్తుంది. ఈ నూతన ఆవిష్కరణ గురించి నేచర్ గ్రూప్ అంతర్జాతీయ జర్నల్ కమ్యూనికేషన్స్ మెటీరియల్స్‌లో ప్రచురించారు. మిగతా రంగుల్ని నేరుగా వెదజల్లే పరికరాలు మాత్రమే ఇప్పటివరకూ ఆవిష్కరించారు. తమ నూతన ఆవిష్కరణతో ధవళకాంతిని నేరుగా వెదజల్లే లెడ్‌లైట్లు మార్కెట్‌లోకి రానున్నాయని ఐఐటి మద్రాస్ కెమికల్ ఇంజినీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ అరవింద్‌కుమార్ చంద్రన్ తెలిపారు. పరోక్ష సాంకేతికత ద్వారా వచ్చే ధవళకాంతి సామర్థం తక్కువని, ఇప్పుడున్న అలాంటివాటితో పోలిస్తే తమ ఆవిష్కరణ సామర్థం 8 రెట్లు అధికమని ఆయన తెలిపారు.