ప్రియాంక గాంధీ వెల్లడి
లక్నో: రానున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో 40 శాతం పార్టీ టికెట్లను మహిళలకు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించారు. మంగళవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ&మహిళలు మార్పు తీసుకురాగలరని, ఇందుకోసం వారు ముందడుగు వేయాలని ప్రియాంక పిలుపునిచ్చారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని బాలికల కోసమే ఈ నిర్ణయమని, మార్పును కోరుకునే మహిళల కోసమే ఈ నిర్ణయమని కాంగ్రెస్ పార్టీ ఉత్తర్ ప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న ప్రియాంక అన్నారు. అయితే అభ్యర్థి సమర్థత ప్రాతిపదికన టికెట్ కేటాయింపు ఉంటుందని ఆమె షరతు విధించారు. సాంప్రదాయకంగా ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలలో కులం ప్రధాన భూమిక పోషిస్తుంటుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగవలసి ఉన్న యుపి అసెంబ్లీ ఎన్నికలలో సైతం గణనీయ స్థాయిలో ఉన్న బ్రాహ్మణ ఓట్లను ఆకట్టుకునేందుకు బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.