బిజెపితో సీట్ల సర్దుబాటు సంకేతాలు
చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారు. అంతేకాదు, వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం గనుక వెనక్కి తీసుకుంటే వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో సీట్ల సర్దుబాటు ఒప్పందం కుదుర్చుకునే అవకాశం కూడా ఉందని ఆయన సూచన ప్రాయంగా తెలియ జేశారు.‘ పంజాబ్ భవిష్యత్తు కోసం పోరాటం కొనసాగుతుంది. ఏడాదికి పైగా ఆందోళన చేస్తున్న మన రైతులతో పాటుగా రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్తు కోసం త్వరలోనే సొంత పార్టీ ప్రారంభంపై ప్రకటన చేస్తా’ అని అమరీందర్ సింగ్ పేరిట ఆయన మీడియా సలహాదారు రవీన్ తుక్రల్ మంగళవారం ఒక ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాదు అకాలీదళ్ చీలిక వర్గాలు ముఖ్యంగా ధిండ్సా, బ్రహ్మపుర వర్గాలు లాంటి భావస్వామ్య వర్గాలతో కూడా పొత్త్తులకోసం చూస్తున్నామని కూడా ఆయన తెలిపారు. పంజాబ్‌లో నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధ్ధూతో విభేదాలు, ఆయనకు పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టడం కారణంగా గత నెల ముఖ్యమంత్రి పదవినుంచి వైదొలగిన కెప్టెన్ అమరీందర్ సింగ్ తాను కాంగ్రెస్‌లో ఉండబోనని గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు బిజెపిలో చేరబోనని కూడా ఆయన అదే సందర్భంలో స్పష్టం చేశారు. దీంతో ఆయన కొత్త పార్టీ పెట్టవచ్చంటూ అప్పటినుంచి ఊహగానాలు వస్తూనే ఉన్నాయి.