బిల్లుల కష్టాలకు చెక్ : సజ్జనార్
ప్రయాణీకులకు టిఎస్‌ఆర్టీసి గుడ్ న్యూస్
బస్టాండుల్లో చిల్లర కష్టాలకు చెక్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ సేవలు ప్రారంభిస్తున్నాం : ఎండి సజ్జనార్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రయాణీకులకు టిఎస్‌ఆర్టీసి గుడ్ న్యూస్ అందించింది. ప్రయాణీకులకు మెరుగైన సేవలందించనుంది. ప్రయాణీకుల ఆదరాభిమానాలు మరింతగా పొందేందుకు టిఎస్‌ఆర్టీసి నడుం బిగించింది. ఈ క్రమంలో బస్డాండుల్లో చిల్లర కష్టాలకు చెక్ పెడుతోంది. టికెట్ కొనే సమయంలో ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎండి వీసీ సజ్జనార్ ప్రకటించారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా మహాత్మాగాంధీ బస్టాప్‌లో (ఎంజిబిఎస్) టికెట్ రిజర్వేషన్ కౌంటర్, పార్సిల్ కార్గో సేవల దగ్గర, రేతిఫైల్ బస్టాండ్‌లోని బస్‌పాస్ కౌంటర్లలో డిజిటల్ చెల్లింపులు ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.
పరిస్థితిని పరిశీలించిన తర్వాత రాష్ట్రంలోని అన్ని డిపోల్లో ఆన్‌లైన్ పేమెంట్ సదుపాయాన్ని అమలు చేస్తామని సజ్జనార్ తెలిపారు. ప్రయాణీకుల సౌలభ్యాన్ని ఎప్పటికప్పుడు పరిగణనలోనికి తీసుకుంటూ టిఎస్‌ఆర్టీసి ముం దడుగు వేస్తోంది. అందులో భాగంగా డిజిటల్ చెల్లింపులపై దృష్టి సారించింది. ప్రస్తుతం నడుస్తోంది డిజిటల్ యుగం. కాలానికి అనుగుణంగా టిఎస్‌ఆర్టీసి తన పంథా మార్చుకుంటోంది. ప్రతీదీ ప్రయాణికుడి చెం తకు చేర్చడం ద్వారా ప్రయాణీకులను మరింతగా తనవైపుకు తిప్పుకునేందుకు ఆర్టీసీ కృషి చేస్తోంది. డిజిటల్ చెల్లింపులు ప్రవేశపెట్టడం ద్వారా బస్టాండ్‌లలో ప్రయాణీకుల చిల్లరకష్టాలు గట్టెక్కనున్నాయన్నమాట.