Saturday, November 23, 2024

కశ్మీర్‌లో కొత్త కుంపటి!

- Advertisement -
- Advertisement -

Militants Attacks targeting non-Kashmiri

కశ్మీర్‌లో కొత్త తరహా ఉగ్రహింస సాగుతున్న సంగతి ఇంతకు ముందే వెల్లడైంది. అదిప్పుడు తీవ్రమైంది. ఉగ్రమూకలు కశ్మీరీయేతరులను, వలస కార్మికులను, ముస్లిమేతరులను లక్షం చేసుకొని దాడులు సాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లి పొట్ట పోషించుకుంటున్న వారిని ఎంచుకొని కాల్చి చంపుతున్నారు. అక్కడ తక్కువ అద్దెలకు లభించే చిన్న చిన్న గదుల్లో నివసిస్తున్న బయటి కార్మికులను హతమారుస్తున్నారు. ఈ నెలలో ఇంత వరకు 11 మందిని బలి తీసుకున్నారు. వీరిలో ఐదుగురు స్థానికేతరులైన వలస కార్మికులు.

వీరిలో బీహార్‌కు చెందిన ముగ్గురు, యుపి, చత్తీస్‌గఢ్‌లకు చెందిన ఇద్దరు ఉన్నారు. పాకిస్తాన్ నుంచి పని చేస్తున్న లష్కర్ ఏ తోయిబా మంత్రించి పంపించిన ది రెసెస్టెంట్ ఫ్రంట్ (టిఆర్‌ఎఫ్) అనే దాని పిలక ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు తెగబడుతున్నట్టు భావిస్తున్నారు. కశ్మీర్ లోయలోని సిక్కులను, పండిట్లను ఏరి, ఎంచి హతమారుస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. మఖన్‌లాల్ బింద్రూ అనే శ్రీనగర్‌లోని మందుల షాపు యజమాని అయిన పండిట్‌ను హతమార్చిన ఘటన ఆ వర్గంలో తీవ్ర భయోత్పాతాన్ని కలిగించింది. పండిట్ల కుటుంబాలు తాత్కాలికంగానైనా జమ్మూకి తరలిపోయి తలదాచుకోడం మొదలైంది.

శ్రీనగర్‌లోని ఒక పాఠశాలలో జొరబడి అక్కడ పని చేస్తున్న ముస్లింలను విడిచిపెట్టి ఒక సిక్కు మహిళా ప్రధానోపాధ్యాయురాలిని, ఒక పండిట్ ఉపాధ్యాయుని టెర్రరిస్టులు హతమార్చిన ఘటన తీవ్ర ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. లోయలోని ఈ రెండు వర్గాలకు చెందిన ప్రజలు నిరసన ప్రదర్శనలు తీశారు. ఈ హత్యల సరళిని అధ్యయనం చేయగా కొత్త టెర్రరిస్టులు రంగ ప్రవేశం చేశారని బోధపడుతున్నట్టు ఎన్‌ఐఎ (జాతీయ దర్యాప్తు సంస్థ) వెల్లడించింది. ఈ టెర్రరిస్టులు గతంలో భద్రతా దళాలపై, పోలీసులపై రాళ్లు విసిరిన మూకల్లోని వారని భావిస్తున్నట్టు సమాచారం. కశ్మీర్ లోయలోని ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల్లో అదనపు సీట్లు మంజూరు చేయడం వల్ల స్థానికేతరులు వచ్చి చేరడానికి అవకాశం కలుగుతున్నదని, ఇది ఆయా కాలేజీల్లో వాతావరణాన్ని కలుషితం చేస్తున్నదని టెర్రరిస్టులు భావిస్తున్నట్టు పోలీసు దాడుల్లో స్వాధీనం చేసుకున్న టిఆర్‌ఎఫ్ పత్రాల్లో వెల్లడైందని సమాచారం.

అలాగే బయటి పారిశ్రామిక వేత్తలకు కశ్మీర్‌లో భూమి కేటాయించడానికి తోడ్పడుతున్న వారిని కూడా టెర్రరిస్టులు లక్షంగా చేసుకుంటున్నారని తెలిసింది. కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని ప్రధాని మోడీ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత దేశంలోని ఎవరైనా, ఏ ప్రాంతంలోని వారైనా, అక్కడకు వెళ్లి స్థిరపడడానికి, పరిశ్రమలు, వ్యాపారాలు నెలకొల్పుకోడానికి అవకాశం కలిగింది. అది జరగకుండా స్థానికేతరులను భయోత్పాతంలో ముంచే వ్యూహాన్ని ఉగ్రవాదులు అమలు చేస్తున్నారు. తమ కోసం గాలింపు జరిపే పోలీసు అధికారులకు తోడ్పడుతున్న వారిని కూడా వారు వదిలిపెట్టడం లేదు. ఇందువల్ల కశ్మీర్‌లో పని చేస్తున్న బయటి రాష్ట్రాల వారు మూట ముల్లె కట్టుకొని స్వరాష్ట్రాలకు తరలిపోతునారు. సాధారణంగా బయటి రాష్ట్రాల చిన్న చిన్న వ్యాపారులు, కార్మికులు కశ్మీర్‌కు వెళ్లి అక్కడ కుదురుకోడం చాలా ఏళ్లుగా అలవాటైంది. ఆ విధంగా వెళ్లేవారు లక్షా 40 వేల వరకు ఉంటారని అంచనా. వీరు తీవ్రమైన చలి ముంచుకొచ్చినప్పుడు అక్కడ ఉండలేక అంతకు ముందు అంటే నవంబర్, డిసెంబర్‌లలో స్వస్థలాలకు వెళ్లిపోతుంటారు.

ఇప్పుడు ఉగ్ర దాడులకు భయపడి చాలా ముందస్తుగానే ఇళ్లకు తరలిపోతుండడం గమనార్హం. ఆదివారం రాత్రి కొల్గాం జిల్లాలోని వామ్‌పో అనే చోట కార్మికులపై ఉగ్రదాడిలో ఇద్దరు స్థానికేతరులు మరణించగా, ఒకరు గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత అక్కడి కశ్మీరీయేతరుల్లో భయం మరింతగా చోటు చేసుకుంది. క్యాబ్‌లు, బస్సులు, రైళ్లు వగైరా రవాణా వాహనాలను పట్టుకొని జమ్మూకి అక్కడి నుంచి బయటి రాష్ట్రాల్లోని స్వస్థలాలకు చేరుతున్నారు. కొన్ని చోట్ల పోలీసులు ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారని కొద్ది మంది మాత్రం జీవనావసరం రీత్యా అక్కడే ఉండి పనుల్లో కొనసాగడానికి నిర్ణయించుకుంటున్నారని వార్తలు చెబుతున్నాయి.

మొత్తానికి టెర్రరిస్టులు కశ్మీర్ లోయలోని స్థానికేతరులు, ముస్లిమేతరులలో ప్రాణ భయం కల్పించడంలో సఫలమయ్యారు. అయితే స్థానికేతరుల పట్ల స్థానికులలో ద్వేష భావం ఏర్పడలేదని సమాచారం. బీహార్‌కు చెందిన వలస కార్మికులను ఉగ్రవాదులు పని కట్టుకొని వారి గదుల్లో దూరి హతమార్చడం పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కలుసుకొని ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్‌ల నుంచే ఎక్కువగా కార్మికులు కశ్మీర్‌కు వెళుతుంటారు. వీరిని హతమార్చడం ద్వారా కశ్మీర్‌ను దేశంలోని మిగతా ప్రాంతాల స్థాయికి మార్చే కేంద్ర ప్రభుత్వ వ్యూహాన్ని భగ్నం చేయాలని ఉగ్రవాదులు తలపెట్టారు. దీనిని కాకుండా చేయడం కేంద్ర పాలకుల ముందున్న పెద్ద సవాలు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News