Saturday, November 23, 2024

ఉత్తరాఖండ్ లో భారీ వరదలు…. 52 మంది మృతి

- Advertisement -
- Advertisement -

వరదల అనంతర సమస్యలతో
ఉత్తరాఖండ్ సతమతం
రోడ్లు, విద్యుత్, కమ్యూనికేషన్ పునరుద్ధరణకు మరికొన్ని రోజులు
52కు చేరిన మృతులు, 5 మంది గల్లంతు

52 dead in Uttarakhand Rains
డెహ్రాడూన్: వర్షాలు, వరదల అనంతర సమస్యలతో ఉత్తరాఖండ్ సతమతమవుతోంది. బుధవారం ఉదయానికి ఆ రాష్ట్రంలో ఒకింత ప్రశాంత వాతావరణం ఏర్పడింది. కాగా, ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల ఉత్తరాఖండ్‌లో 52 మంది చనిపోగా, 5 మంది గల్లంతయ్యారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు 1300 మందిని వరద ప్రాంతాల నుంచి పునరావాస కేంద్రాలకు తరలించాయి. ఉద్ధమ్‌సింగ్‌నగర్, నైనీటాల్ నుంచి బాధితులను తరలించినట్టు ఎన్‌డిఆర్‌ఎఫ్ ప్రతినిధి తెలిపారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కుమౌన్ ప్రాంతంలో పర్యటించారు. కొండచరియలు విరిగిపడి, వరదలలో చనిపోయిన వారికి నాలుగు లక్షల రూపాయల పరిహారం ఇస్తానని ప్రకటించారు. భారీ వర్షాలకు కారణంగా ప్రతీ జిల్లాకు పది కోట్ల రూపాయలను విడుదల చేశారు. మూడు రోజులపాటు కురిసిన వర్షాలు, వరదల వల్ల పలుచోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థలు నిలిచిపోయాయి. కొండచరియలు విరిగిపడటంతో రాణీఖేత్, ఆల్మోరాకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. గౌలానది పొంగిపొర్లడంతో నైనీటాల్‌లోని కాత్‌గోదామ్ రైల్వేస్టేషన్‌లో ట్రాక్ దెబ్బతిన్నది. మరమ్మతులు జరిపి పునరుద్ధరించడానికి నాలుగైదు రోజులు పడుతుందని డిజిపి అశోక్‌కుమార్ తెలిపారు. నైనీటాల్‌లో బుధవారం ఉదయానికి రోడ్లు కాస్త సాధారణస్థితికి వచ్చాయి. వర్షం కురిసినపుడు నైనీ సరస్సు ఉప్పొంగడంతో అక్కడ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పరిస్థితి కుదుటపడటంతో విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థల్ని పునరుద్ధరించినట్టు అధికారులు తెలిపారు. నైనీటాల్‌కాలాదుంగి రహదారిలో చిన్న వాహనాలకు అనుమతిచ్చారు. నైనీటాల్‌భౌవాలీ మార్గాన్ని మాత్రం ఇప్పటికీ మూసి ఉంచారు. ఆ మార్గంలో కొండచరియలు విరిగిపడటమే అందుకు కారణం. హాల్ద్‌వానీభీమ్‌తాల్ రహదారిని పునరుద్ధరించారు.
మరోవైపు శివారు గ్రామాలు ఇంకా ముంపు బారినే ఉన్నాయని అధికారులు తెలిపారు. శిథిలాలను తొలగించి, రహదారులను పునరుద్ధరించడానికి మరికొన్నిరోజులు పడుతుందని తెలిపారు. ఆ రాష్ట్రంలో ఎన్‌డిఆర్‌ఎఫ్‌నకు చెందిన 17 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఉద్ధమ్‌సింగ్‌నగర్‌లో ఆరు, ఉత్తరకాశీలో రెండు, చమోలీ, డెహ్రాడూన్, చంపావత్, పితోర్‌గఢ్, హరిద్వార్‌ల్లో ఒక్కో బృందం చొప్పున విధులు నిర్వహిస్తున్నాయి. నైనీటాల్‌లో రెండు బృందాలతోపాటు ఓ ఉప బృందం సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని ఎన్‌డిఆర్‌ఎఫ్ ప్రతినిధి తెలిపారు.

పరిస్థితి ఇంకా ఆందోళనకరమే: రాహుల్‌గాంధీ

ఎడతెగని వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరైన ఉత్తరాఖండ్‌లో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ట్విట్ చేశారు. వరదల్లో చిక్కుకున్న బాధితులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News