3 శాతం ప్లస్‌తో ఇక 31 శాతానికి
పెన్షనర్లకు డిఆర్ పెంపుదల
హెచ్చింపులు జులై నుంచే అమలులోకి
న్యూఢిల్లీ : దీపావళి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వోద్యోగులు, పింఛన్‌దార్లకు కేంద్రం తీపి కబురు వెలువరించింది. ఉద్యోగుల కరవు భత్యం (డిఎ)ను 3 శాతం పెంచింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని గురువారం కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు తెలిపారు. ఇక పించన్‌దార్లకు ఇచ్చే కరవు భృతి (డిఆర్)ను కూడా 3 శాతం పెంచారు. ఇప్పటి పెంపుదలతో కేంద్ర ఉద్యోగులకు ఇక డిఎ మొత్తం 31 శాతానికి చేరుతుంది. ఇప్పటివరకూ ఇది 28 శాతంగా ఉంది. డిఎ పెంపు నిర్ణయంతో 47.14 లక్షల మంది సర్వీసుల్లోని ఉద్యోగులకు , 68.62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. పెంపుదల నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై వార్షికంగా రూ 9488 కోట్ల అదనపు భారం పడుతుంది. దేశంలో కొవిడ్ మహమ్మారి తీవ్రత దశలో కేంద్ర ప్రభుత్వం గత ఏడాది డిఎ, డిఆర్ కిస్తులను నిలిపివేసింది. గత ఏడాది జనవరి, జులై తరువాత ఈ ఏడాది జనవరిలో ఇవ్వాల్సిన ఈ వాయిదాలను మొత్తం మీద మూడింటిని స్తంభింపచేసింది. తరువాత పరిస్థితిని సమీక్షించుకుని కేంద్ర ప్రభుత్వం వీటిని పునరుద్ధరించింది. అంతేకాకుండా ఇంతకు ముందు వరకూ ఉన్న 17 శాతం రేటును 28 శాతానికి పెంచింది. ఇప్పుడు దీనికి మూడు శాతం అదనంగా జోడించారు.
పిఎం గతిశక్తి జాతీయ పథకానికి ఆమోదం
గురువారం జరిగిన కేంద్ర మంత్రి మండలి భేటీలోనే ప్రభుత్వం పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం తెలిపింది. రూ 100 లక్షల కోట్ల ఈ మాస్టర్ ప్లాన్‌ను ఈ నెల 13వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. బహుళ మంత్రిత్వశాఖలను, వివిధ ప్రభుత్వ విభాగాలను సమన్వయపరుస్తూ దేశంలో భారీ ప్రాజెక్టులను, మౌలిక సాధనాసంపత్తిని ఏర్పాటు చేసేందుకు , సరైన పర్యవేక్షణ, సముచిత ప్రోత్సహ కల్పనకు ఈ మాస్టర్ ప్లాన్‌ను తలపెట్టారు. ఈ పిఎం గతిశక్తి పథకానికి సంబంధించి కీలక వ్యవస్థ ఉంటుందని, సెక్రెటరీల స్థాయి సాధికారిక బృందం పర్యవేక్షణలో పనిచేస్తుందని , గతిశక్తి పథకానికి కేబినెట్ ఆమోదం గురించి కేంద్ర మంత్రి ఠాగూర్ విలేకరులకు తెలిపారు. సాధికారిక బృందానికి కేబినెట్ సెక్రెటరీ సారధ్యం వహిస్తారు. ఇక 18 మంత్రిత్వశాఖలకు చెందిన సెక్రెటరీలు సభ్యులుగా ఉంటారని వివరించారు. ఈ బృందం ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. ఈ పథకంలో అంతర్భాగంగా మల్టీమోడల్ నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ ( ఎన్‌పిజి) ఏర్పాటు జరుగుతుంది. ఇందులో వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాలకు చెందిన నెట్ వర్క్ ప్లానింగ్ డివిజన్‌లు అంతర్భాగంగా ఉంటాయి.