Saturday, November 23, 2024

బేటాతో జైలు ములాఖత్

- Advertisement -
- Advertisement -
Shah Rukh Khan Meets Son Aryan Khan
ఆర్యన్‌ను కలిసిన షారూక్

ముంబై : బాలీవుడ్ ప్రముఖ నటుడు షారూక్ ఖాన్ గురువారం ఉదయం స్థానిక అర్థూర్ రోడ్ జైలుకు వెళ్లి కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ను కలిశారు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ జైలులో ఉండాల్సి వస్తోంది. స్థానిక కోర్టు ఆర్యన్‌కు బెయిల్ నిరాకరించింది. దీనితో ఆయన లాయర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 26న హైకోర్టు ఈ బెయిల్ దరఖాస్తుపై విచారణ జరుపుతుంది. ఇక్కడి ముంబై సెంట్రల్ ప్రాంతంలో ఉన్న జైలు వద్దకు షారూక్ ఉదయం 9 గంటలకు చేరుకున్నారు. 9.35 ప్రాంతంలో తిరిగి వెళ్లిపొయ్యారు. అయితే షారూక్ జైలులో కుమారుడితో కేవలం పది నిమిషాలే మాట్లాడి ఉంటారని వెల్లడైంది. కొవిడ్ నిబంధనలతో ఇప్పటివరకూ ఈ అత్యంత భద్రతాయుత జైలులోని ఖైదీలను కలుసుకునేందుకు కుటుంబ సభ్యులెవరికీ అనుమతిని ఇవ్వడం లేదు. అయితే గురువారం ఉదయం నుంచి ఈ ఆంక్షల సడలింపు జరిగింది. ఈ క్రమంలోనే షారూక్ తన కుమారుడిని కలిశారు. నటుడు అక్కడికి వచ్చిన నేపథ్యంలో జైలు ఆవరణలో భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తొలుత షారూక్ ఆధార్‌కార్డును గుర్తింపు పత్రాలను ఫార్మాల్టీ ప్రకారం పరిశీలించిన తరువాత జైలు అధికారులు ఓ టోకెన్ ఇచ్చారు. దీనిని తీసుకుని ఆయన జైలులోని జనరల్ వార్డు వద్దకు వెళ్లారు. తండ్రికొడుకుల మధ్య గ్రిల్, గాజుగోడ ఉందని ఇంటర్‌కామ్ ద్వారా ఇద్దరూ మాట్లాడుకున్నారని జైలు అధికారులు తెలిపారు.

తండ్రికొడుకుల బాధోద్వేగం.. జైలు భోజనంపై షారూక్ ఆరా

జైలులో కుమారుడిని చూడగానే షారూక్ భావోద్వేగానికి గురయ్యారు. సరిగ్గా భోజనం చేస్తున్నావా? అని తండ్రి కుమారుడిని తొలి ప్రశ్న వేసినట్లు, తిండి సయించడం లేదని కొడుకు చెప్పినట్లు అక్కడున్న వారు తెలిపారు. జైలు పాలయిన తరువాత ఆర్యన్ తండ్రిని కలియడం ఇదే తొలిసారి, అరెస్టు అయిన వెంటనే ఓసారి తల్లిదండ్రులతో ఆర్యన్ వీడియో కాల్‌లో మాట్లాడారు. తరువాత షారూక్‌తో నేరుగా కలియడం ఇదే తొలిసారి. కుమారుడికి ఇంటి భోజనం పంపించేందుకు అనుమతి ఉంటుందా? అని ఆ తరువాత జైలు అధికారులను షారూక్ కోరినట్లు తెలిసింది. అయితే దీనికి కోర్టు అనుమతి అవసరం అని అధికారులు స్పష్టం చేశారు. కుమారుడు జైలు పాలయినప్పటి నుంచి షారూక్ ఇంట్లో అంతా దిగులుగా గడుపుతున్నారు. ఇంట్లో ఎటువంటి వేడుకలు వద్దని, ఆర్యన్ ఇంటికి వచ్చేవరకూ స్వీట్లు ఆర్బాటపు వంటకాలకు దిగవద్దని తల్లి గౌరీఖాన్ ఇంటి పనివారిని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News