అయితే ఇంటెలిజన్స్ నివేదికతో ఆ ఆలోచన విరమించుకుంది
జపాన్‌లోని అస్థికలను భారత్‌కు తీసుకు రావాలి
నేతాజీ మనుమడి డిమాండ్
కోల్‌కతా: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉన్న విషయం తెలిసిందే. 1945లో తైవాన్‌లో జరిగిన ఒక విమాన ప్రమాదంలో నేతాజీ మృతి చెందారని భావిస్తుండగా, ఆ ప్రమాదంలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారని, భారత్‌కు తిరగి వచ్చి ఒక సాధువుగా చాలా సంవత్సరాలు గడిపారంటూ రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. నేతాజీ అస్థికలు ప్రస్తుతం జపాన్‌లోని రెంకోజీ బౌద్ధ ఆలయంలో భద్రపరిచి ఉన్నట్లు కూడా చెప్తారు. ఈ అస్థికలను భారత్‌కు తీసుకు రావాలని1990 దశకంలో అప్పటి పివి నరసింహారావు ప్రభుత్వం భావించిందని, అయితే అలా చేయడం వల్ల నేతాజీ మరణంపై వివాదం కారణంగా కోల్‌కతాలో అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందంటూ ఇంటెలిజన్స్ వర్గాల నివేదిక హెచ్చరించిన కారణంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకుందని నేతాజీ మనుమడు, నేతాజీపై లోతుగా పరిశోధన చేసిన ప్రముఖ రచయిత ఆశిష్ రే అంటున్నారు.
1945నుంచి రెంకోజి ఆలయంలో ఉంచిన ఈ అస్థికలను భారత్‌కు తీసుకు రావాలని ఆయన గట్టిగా కోరారు. ఈ అస్థికలపై న్యాయమైన హక్కు జర్మనీలో నివసిస్తున్న నేతాజీ కుమార్తె ప్రొఫెసర్ అనితా బోస్‌కే దక్కుతాయని కూడా ఆయన అన్నారు. ఆజాద్ హింద్ పేరుతో నేతాజీ స్థాపించిన ప్రభుత్వం 78వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భారత విదేశాంగ శాఖతో కలిసి ఇండో జపాన్ సమురాయ్ సెంటర్ శుక్రవారం నిర్వహించిన ఒక సెమినార్‌లో మాట్లాడుతూ అశిష్ రే ఈ డిమాండ్ చేశారు. నేతాజీ అస్థికలను భారత్‌కు తీసుకు రావడం కోసి పివి నరసింహారావు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా దీనిలో సభ్యుడిగా ఉన్నారని ఆయన చెప్పారు. అయితే దీనిపై కోల్‌కతాలో అల్లర్లు చెలరేగే అవకాశం ఉందంటూ ఇంటెలిజన్స్ వర్గాలు ఒక నివేదికలో హెచ్చరించడంతో ప్రభుత్వం ఈ ప్రయత్నాన్ని విరమించుకుందని ఆయన చెప్పారు. నేతాజీ మరణం చుట్టూ ఉన్న వివాదాలపై ఆశిష్ రే ‘లెయిడ్ టు రెస్ట్’ పేరుతో ఒక పుస్తకం కూడా రాశారు.